భారత లిఫ్టర్ మీరాభాయ్ చాను తమకు స్ఫూర్తి అంటున్న పాక్ పసిడి విజేత

  • బ్రిటన్ లో కామన్వెల్త్ క్రీడలు
  • పాకిస్థాన్ కు తొలి స్వర్ణం అందించిన నూహ్ దస్తగిర్
  • వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుత ప్రదర్శన
  • చాను తమకు మార్గదర్శి అంటూ వ్యాఖ్యలు
బ్రిటన్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పాకిస్థాన్ కు మొట్టమొదటి స్వర్ణం లభించింది. 24 ఏళ్ల పాకిస్థానీ వెయిట్ లిఫ్టర్ నూహ్ దస్తగిర్ భట్ స్నాచ్ లో 173 కిలోలు, జెర్క్ లో 232 కిలోల బరువెత్తి పసిడి సాధించాడు. తన ప్రదర్శన అనంతరం నూహ్ దస్తగిర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చాను స్ఫూర్తి అని వెల్లడించాడు. 

మీరాభాయ్ చాను కొన్నిరోజుల కిందటే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. నూహ్ దస్తగిర్ మాట్లాడుతూ, "మీరాభాయ్ చానునే మాకు ప్రేరణ. ఆమెను స్ఫూర్తిప్రదాతగా భావిస్తున్నాం. ఆమె తన ప్రదర్శనతో మాకు మార్గదర్శిగా నిలిచింది. దక్షిణాసియా దేశాలకు కూడా ఒలింపిక్ పతకాలు గెలిచే సత్తా ఉంది.. టోక్యో ఒలింపిక్స్ లో ఆమె (మీరాభాయ్ చాను) రజతం గెలిచినప్పుడు మేం ఎంతో గర్వించాం" అని వివరించాడు. 

కాగా, ఇవాళ్టి పోటీలో భారత లిఫ్టర్ గురుదీప్ సింగ్ కాంస్యం దక్కించుకున్నాడు. గురుదీప్ సింగ్, తాను మంచి స్నేహితులమని నూహ్ దస్తగిర్ వెల్లడించాడు.
.


More Telugu News