తల్లీబిడ్డలను చూసి కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం జగన్... అక్కడికక్కడే కలెక్టర్ కు ఆదేశాలు

  • తునిలో సీఎం జగన్ పర్యటన
  • సీఎం కోసం రోడ్డు పక్కనే వేచి ఉన్న తనూజ అనే మహిళ
  • ఆమె కుమారుడి పరిస్థితి పట్ల చలించిపోయిన సీఎం జగన్
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ సీఎం జగన్ పర్యటన కొనసాగింది. తుని ప్రాంతంలో ఆయన తన కాన్వాయ్ తో వెళుతుండగా మార్గమధ్యంలో ఓ తల్లీబిడ్డలను చూసి స్పందించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపించారు. తన బస్ నుంచి దిగి ఆ తల్లితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాకినాడ జిల్లాకు చెందిన ఆ మహిళ పేరు తనూజ. ప్రత్తిపాడు మండలం శంఖవరం మండలం మండపం గ్రామ వాసి. సీఎం వస్తున్నారని తెలిసి ఆమె తన బిడ్డతో రోడ్డు పక్కనే వేచి ఉంది. 

ఇంతలో సీఎం వాహనం రావడంతో ఆమెను, ఆమె బిడ్డ పరిస్థితిని గమనించాలని ఇతరులు కూడా సీఎంకు సంజ్ఞల ద్వారా వివరించారు. సీఎం కాన్వాయ్ ఆగడంతో తనూజ, తన బిడ్డతో పరుగుపరుగున వెళ్లింది. బస్ నుంచి వెలుపలికి వచ్చిన సీఎం జగన్ ఆమె చెప్పింది ఓపిగ్గా విన్నారు.

ఆమె పరిస్థితి పట్ల ఆయన చలించిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడ్ని చూసి కదిలిపోయారు. వారి సమస్యను పరిష్కరించాలంటూ అక్కడికక్కడే కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అక్కడే ఉన్న కలెక్టర్ ను చూపిస్తూ, 'కలెక్టర్ కు మీ గురించి చెప్పానమ్మా... మీ సమస్య పరిష్కారం అవుతుంది' అంటూ ఆ మహిళకు భరోసా ఇచ్చారు.


More Telugu News