భార‌త త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్‌

  • మ‌హారాష్ట్రకు చెందిన జ‌స్టిస్ ల‌లిత్‌
  • బాంబే హైకోర్టులో న్యాయ‌వాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన వైనం
  • 2014లో సరాసరి సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు
  • జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌ర్వాత సీనియ‌ర్ మోస్ట్ జ‌డ్జి జ‌స్టిస్ ల‌లిత్ 
  • జ‌స్టిస్ ల‌లిత్ పేరును సిఫార‌సు చేసిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి)గా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ ఈ నెల 26న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో భార‌త త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు త‌న త‌ర్వాత త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ యూయూ ల‌లిత్ పేరును జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సిఫార‌సు చేశారు.
జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌ర్వాత సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులంద‌రిలోకి జస్టిస్ ల‌లిత్ సీనియ‌ర్ మోస్ట్ జ‌డ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టులో సీనియ‌ర్ మోస్ట్ న్యాయ‌మూర్తినే సీజేఐ ప‌ద‌వి వ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సీనియారిటీలో త‌న త‌ర్వాతి స్థానంలో ఉన్న జ‌స్టిస్ ల‌లిత్ పేరును జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సిఫార‌సు చేశారు. ఈ నెల 27న జ‌స్టిస్ ల‌లిత్ సీజేఐగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

దేశంలో సంచ‌ల‌నం రేకెత్తించిన ట్రిపుల్ త‌లాక్ వ్య‌వ‌హారంపై తీర్పు వెలువ‌రించిన ఐదుగురు న్యాయ‌మూర్తుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నంలో జ‌స్టిస్ ల‌లిత్ కూడా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ ప‌ద్ధతిలో విడాకులు ఇవ్వ‌డం కుద‌రదంటూ రాజ్యాంగ ధర్మాస‌నం తీర్పు ఇచ్చింది. మ‌హారాష్ట్రకు చెందిన జ‌స్టిస్ ల‌లిత్ తొలుత బాంబే హైకోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ మొద‌లుపెట్టి.. ఆ త‌ర్వాత సుప్రీంకోర్టుకు త‌న మ‌కాం మార్చారు. 2014లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టారు.


More Telugu News