గోరంట్ల మాధవ్ ను మహిళా సంక్షేమ శాఖ మంత్రిని చేయాలని కోరుకుంటున్నానంటూ రఘురామకృష్ణరాజు సెటైర్లు!

  • మాధవ్ న్యూడ్ వీడియో కాలింగ్ వీడియోలు తనకు కొన్ని వందలు వచ్చాయన్నా రఘురాజు 
  • ఆ వీడియోలను చూసిన వారిని అరెస్ట్ చేస్తే ప్రపంచంలో ఉన్న జైళ్లు సరిపోవని సెటైర్ 
  • అంబటి, అవంతిల ఆడియోలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించాలని డిమాండ్ 
ఒక యువతితో న్యూడ్ వీడియోలో మాట్లాడారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందిన ఒక వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, అది మార్ఫింగ్ వీడియో అంటూ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను మీడియాకు చూపించారు. దీనిపై, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురాకృష్ణరాజు స్పందిస్తూ... మాధవ్ న్యూడ్ కాల్ వీడియో అంటూ తనకే 250 నుంచి 300 వరకు వీడియోలు వచ్చాయని, వాటిని తాను లెక్కించలేదని... కొన్ని వందల మంది నుంచి తనకే వీడియోలు వచ్చాయంటే... ఇక సోషల్ మీడియాలో ఒక దుమారంలా, ఒక పెను తుపానులా వచ్చుంటాయని అన్నారు. 

తాను మాధవ్ న్యూడ్ కాలింగ్ వీడియో చూశానని... అలాగే ఢిల్లీలోని ఆంధ్రభవన్ లో ప్రెస్ మీట్ లో మాధవ్ మీడియాకు చూపించిన వీడియోను కూడా చూశానని రఘురాజు చెప్పారు. మాధవ్ చూపించిన వీడియోలో ఆయన జిమ్ లో ఎక్సర్ సైజులు చేసుకుంటూ ఉంటే... ఆయన వీపు భాగాన్ని వీడియోలో చాలా చక్కగా చూపించారని అన్నారు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వీడియాలో వచ్చింది ఆయన శరీర ముందు భాగం, ఈ తర్వాత క్లైమాక్స్ సీన్ అని చెప్పారు. అయితే ఈ వీడియోపై గోరంట్ల మాధవ్ చాలా నిష్పక్షపాతంగా స్పందించారని... వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని... వీడియోను షేర్ చేసిన వారిపై, వీడియోను చూసిన వారిపై తాను కేసులు పెడతానని చాలా ఫెయిర్ గా చెప్పారని అన్నారు. ఆయన స్పందనలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు.

వీడియోలను చూసిన వారిని అరెస్ట్ చేయాలంటే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారు రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల్లో నాలుగు కోట్ల మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని రఘురాజు ఎద్దేవా చేశారు. ఈ వీడియోను ఫార్వర్డ్ చేసిన వారిలో తమ సీఎం కార్యాలయంలో ఉన్నవారు కూడా ఉండొచ్చని... ఎందుకంటే వారు కూడా కంగారు పడి వీడియోను షేర్ చేసి ఉండొచ్చని అన్నారు. ఈ లెక్కన నాలుగు కోట్ల జనాలను జైల్లో పెట్టాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్న జైళ్లు సరిపోవని చెప్పారు. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం కాస్త సంయమనం పాటించి ఆ వీడియోను వెంటనే మన రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు కాకుండా... మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే... సోషల్ మీడియా వీడియోలో చూపించిన ఫ్రంట్, మాధవ్ వీడియోలో చూపించిన బ్యాక్ రెండూ ఒకటో, కాదో తెలిసిపోతుందని అన్నారు. 

తాను కూడా వైసీపీ లోక్ సభ సభ్యుడినేనని... అందువల్ల మాధవ్ కోరిన విధంగానే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆయన ముందు, వెనుకలను పరిశీలించి... రెండు, మూడు రోజుల్లో ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేస్తే ఈ దుమారం ఆగిపోతుందని... లేకపోతే మహిళల్లో ఇదొక విప్లవంగా మారుతుందని రఘురాజు చెప్పారు. అసలే తమ ముఖ్యమంత్రి గారు మహిళలను ఎంతో గౌరవిస్తారని.. ఇలాంటి విషయాలను సహించే గుణం ఆయనది కాదని అన్నారు. 30 రోజుల్లోనే అన్ని శిక్షలు, అవసరమైతే ఉరిశిక్షను వేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి మా జగన్ గారు అని అన్నారు. 

వీడియో చూస్తుంటే వీడియోలో ఉన్నది మాధవ్ గారే అనిపిస్తోందని... అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగిందని... అలాగే మనిషిని పోలిన మనుషులు కూడా ఏడుగురు ఉంటారని అంటుంటారని... మాధవ్ కు ఉన్న అంతే జుట్టు, అవే మీసాలతో వేరెవరైనా ఉండొచ్చని రఘురాజు ఎద్దేవా చేశారు. ఒకవేళ వీడియో నిజం అని తేలితే సభ్యసమాజం అసహ్యించుకుంటుందని చెప్పారు. మాధవ్ తప్పు చేశాడని తేలినా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవచ్చని, ప్రమోషన్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చని అన్నారు. గతంతో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిందని... ఆయనను ఇప్పుడు మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. ఆడియో కాల్ లో ఉన్నది అంబటి రాంబాబు గొంతేనా, కాదా అనే విషయంపై కనీసం విచారణ కూడా జరపలేదని చెప్పారు. 

గోరంట్ల మాధవ్ వీడియోతో పాటు, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ల ఆడియోలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని రఘురాజు డిమాండ్ చేశారు. మాధవ్ వీడియో నిజమైతే దిశ చట్టం కింద కేసులు పెడతారా, లేదా అనేది వేచి చూడాలని చెప్పారు. అయితే ఇప్పుడు తమ పార్టీలో ఉన్న విధానం ప్రకారమైతే చర్యలు తీసుకునే అవకాశం లేదని అన్నారు. వీడియో నిజం అయితే యావత్ దేశం, పార్లమెంటు తలదించుకునేంత దారుణమైన అంశమని చెప్పారు. ఒక ఎంపీ గుడ్డలు ఊడదీసుకుని కనిపించడమేంటని అన్నారు. 

మాధవ్ కి మళ్లీ వైసీపీ టికెట్ రావాలని కోరుకుంటున్నానని రఘురాజు చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే... ఎన్నికల తర్వాత మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా కావాలని, ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో కూడా అదే శాఖను చేపట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది మాధవ్ కాదనే విషయం తేలిపోతుందని.... అందుకే ఆయనకు ఆ పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నానని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు.


More Telugu News