అమెజాన్ సూపర్ ఫాస్ట్ డెలివరీ.. రైల్వేతో టైఅప్

  • ఒకటి, రెండు రోజుల్లోనే డెలివరీ సేవలు
  • 97 శాతం పిన్ కోడ్ ల పరిధిలోని వారికి సూపర్ ఫాస్ట్ డెలివరీ
  • వేగవంతమైన అనుభవాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటన
భారతీయ రైల్వేతో అమెజాన్ ఇండియా వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకుంది. 110కి పైగా పట్టణాల మధ్య ప్యాకేజీలను రవాణా చేసుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుందని అమెజాన్ ఇండియా తెలిపింది. తద్వారా దేశవ్యాప్తంగా తన డెలివరీ సేవలను మరింత వేగవంతం చేయనుంది. ఈ భాగస్వామ్యంతో రెండు రోజుల్లో డెలివరీ సేవలను అందించొచ్చని ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని కస్టమర్లకు రెండు రోజుల డెలివరీ సర్వీసులు అందించేందుకు రైల్వేతో ఒప్పందం సాయపడుతుందని అమెజాన్ పేర్కొంది. 2019 నుంచే రైల్వే, అమెజాన్ మధ్య వ్యాపార భాగస్వామ్యం నడుస్తోంది. ఇప్పుడు ఈ వాణిజ్య బంధం మరింత బలపడనుంది. 

‘‘అమెజాన్ నుంచి వేగవంతమైన, విశ్వసనీయ, సురక్షితమైన షాపింగ్ అనుభవాన్ని మా కస్టమర్లకు అందించడమే మా ధ్యేయం. కొన్ని పట్టణాల్లో వేగవంతమైన డెలివరీ సేవలను ఒకటి, రెండు రోజుల్లోనే అందించడం సాధ్యపడుతుంది’’ అని అమెజాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం పిన్ కోడ్ లలో 97 శాతం పిన్ కోడ్ ల పరిధిలో ఒక్క రోజులోనే డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది.


More Telugu News