చ‌ట్టాలన్నింటినీ ప్ర‌జామోదంతోనే అమ‌లు చేయాలంటే కుద‌ర‌దు: ఏపీ మంత్రి బొత్స‌

  • పాఠశాల‌ల విలీన‌మే లేద‌న్న బొత్స‌
  • కేవ‌లం త‌ర‌గ‌తుల విలీనమే జ‌రుగుతోంద‌ని వెల్ల‌డి
  • పాఠ‌శాల‌లు ఇంటి ప‌క్క‌నే ఉండాల‌ని కోరుకోకూడ‌ద‌ని వ్యాఖ్య‌
  • విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోస‌మే నిర్ణ‌య‌మ‌న్న మంత్రి
చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌, వాటి అమ‌లుకు సంబంధించి వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బుధ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వాలు చేసే చ‌ట్టాల‌న్నింటినీ ప్ర‌జామోదంతోనే అమ‌లు చేయ‌డం కుదర‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య వార‌ధులుగా ప్ర‌జా ప్ర‌తినిధులు ఉన్నార‌ని, వారి ఆమోదంతోనే చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తూ ముందుకు సాగుతున్నామ‌ని ఆయ‌న చెప్పారు. 

ఏపీలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విలీనంపై గ‌త కొంత‌కాలంగా ప‌లు ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ గ్రామంలోని పాఠ‌శాల‌ను ఇంకో గ్రామానికి చెందిన పాఠ‌శాల‌లో విలీనం చేయ‌డం ద్వారా త‌మ పిల్ల‌ల‌కు విద్య‌ను దూరం చేస్తున్నారంటూ పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే ప‌లుమార్లు మీడియా ముందుకు వ‌చ్చిన బొత్స తాజాగా బుధ‌వారం మ‌రోమారు మీడియాతో మాట్లాడారు.  

పాఠ‌శాల‌ల విలీన ప్రక్రియ‌లో ప్ర‌జలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే ముందుకు వెళుతున్నామ‌ని బొత్స తెలిపారు. త‌మ పిల్ల‌లు గొప్ప‌వాళ్లు కావాల‌నుకునే త‌ల్లిదండ్రులు పాఠ‌శాల‌లు త‌మ ఇంటి ప‌క్క‌నే ఉండాల‌ని కోరుకోకూడ‌ద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. 

అయినా రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ది త‌ర‌గ‌తుల విలీనం మాత్ర‌మేన‌న్న బొత్స.. పాఠ‌శాల‌ల విలీనం అన్న మాటే లేద‌ని చెప్పారు. రాబోయే త‌రాల భ‌విష్య‌త్తు కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. విద్యా వ్య‌వ‌స్థ‌లో ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌లు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.


More Telugu News