ఏపీ గృహ నిర్మాణ మంత్రి ఎవరో గూగుల్ సహాయం లేకుండా చెప్పగలరా?: అచ్చెన్నాయుడు

  • ఏపీలో నిర్మాణ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారన్న అచ్చెన్న 
  • టీడీపీ హయాంలో లక్షలాది టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేశామని వెల్లడి 
  • ఇళ్ల స్థలాల కొనుగోలు అంటూ కొత్త స్కామ్ కు తెరతీశారని విమర్శ 
రాష్ట్రంలో నిర్మాణ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో లక్షలాది టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేశామని...  దాదాపుగా పూర్తయిన నిర్మాణాలను లబ్ధిదారులకు అందించడానికి ఈ ప్రభుత్వానికి మూడేళ్ల సమయం కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం కట్టిన దృఢమైన, నాణ్యమైన టిడ్కో గృహాలకు దిష్టి చుక్కలు మీ శిలాఫలకాలు అని ఎద్దేవా చేశారు. ఆ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తే కష్ట కాలంలో వారికి ఊరట లభించేదని అన్నారు. 

తన తుగ్లక్ నిర్ణయాలతో వీటిని గాలికొదిలేసి... ఇళ్ల స్థలాల కొనుగోలు అంటూ కొత్త స్కామ్ కు తెరతీశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. పనికిరాని భూములను మూడు, నాలుగు రెట్ల అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించి... వైసీపీ నేతలు మూటలు వెనకేసుకున్నారని అన్నారు. మొత్తంగా మన రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. కళ్ల ముందు జరుగుతున్న విషయాలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు ఎవరో గూగుల్ సహాయం లేకుండా చెప్పగలరా? అని ప్రశ్నించారు.


More Telugu News