నెహ్రూ, వాజ్ పేయిలపై తీవ్ర విమర్శలు చేసిన సుబ్రహ్మణ్య స్వామి

  • నెహ్రూ, వాజ్ పేయి అవివేకులంటూ విమర్శ
  • టిబెట్, తైవాన్ చైనాలో అంతర్భాగమని అంగీకరించినట్టు వ్యాఖ్య
  • చైనా ఇప్పుడు వాస్తవాధీన రేఖను కూడా గౌరవించడం లేదన్న స్వామి
భారతీయ జనతా పార్టీ అసమ్మతి నేత సుబ్రహ్మణ్య స్వామి టిబెట్, తైవాన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులు నెహ్రూ, వాజ్ పేయి విధానాలను తప్పుబట్టడమే కాకుండా, ప్రస్తుత ప్రధాని మోదీని సైతం విమర్శించారు. ఈమేరకు ఒక తాజా ట్వీట్ వదిలారు.

‘‘నెహ్రూ, ఏబీవీ (అటల్ బీహారీ వాజ్ పేయి) అవివేకం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో అంతర్భాగమని భారతీయులం అంగీకరించాం. కానీ, చైనా ఇప్పుడు కనీసం వాస్తవాధీన రేఖను కూడా గౌరవించడం లేదు. లడఖ్ లోని సరిహద్దు భాగాలను ఆక్రమించుకుంటోంది. మోదీ మాత్రం జడత్వంతో ఎవరూ రాలేదని చెబుతున్నారు. మా దగ్గర ఎన్నికలు ఉన్నాయని చైనా తెలుసుకోవాలి’’ అంటూ స్వామి ట్వీట్ చేశారు. 

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటిస్తున్న సమయంలో స్వామి ఈ అంశాన్ని లేవనెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంత కాలంగా సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తుండడం తెలిసిందే.  


More Telugu News