చెలరేగిన సూర్యకుమార్ యాదవ్.. మూడో టీ20లో భారత్‌దే గెలుపు

  • 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
  • 44 బంతుల్లో 76 పరుగులు చేసిన సూర్యకుమార్
  • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యం
వెస్టిండీస్‌తో గత రాత్రి జరిగిన మూడో టీ20లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1తో ముందంజలో నిలిచింది. విండీస్‌ను తొలుత 164 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు ఆ తర్వాత సూర్యకుమార్ వీరబాదుడుతో విజయాన్ని అందుకుంది. 

విండీస్ నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 11 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయాస్ 24, రిషభ్ పంత్ 33 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా నాలుగు, దీపక్ హుడా 10 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. కెప్టెన్ పూరన్ 22, రోవ్‌మన్ పావెల్ 23, హెట్మెయిర్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగో టీ20 ఈ నెల 6న ఫ్లోరిడాలోని లాడెర్‌హిల్‌లో జరుగుతుంది.


More Telugu News