కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా

  • గ‌త కొన్ని రోజులుగా రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాపై చ‌ర్చ‌
  • ఈ రోజు మీడియా ముందుకు వ‌చ్చిన మునుగోడు ఎమ్మెల్యే
  • కాంగ్రెస్‌లో ఉండి ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని ఆవేద‌న‌
  • ఉప ఎన్నిక‌లో ఎవ‌రిని గెలిపించాలో మునుగోడు ఓట‌ర్ల‌కు తెలుసున‌ని వ్యాఖ్య‌
తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా వ్య‌వ‌హారం మంగ‌ళ‌వారం ముగిసింది. ఈ రోజు మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాజ‌కీయాల‌పైనా, కాంగ్రెస్ పార్టీలోని ప‌రిస్థితుల‌పైనా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

త‌న రాజీనామా ద్వారా మునుగోడు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బ‌ల‌హీన ప‌డ‌టంతో పార్టీలో ఉండి కూడా తాను ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని ఆయ‌న తెలిపారు. త‌న జిల్లాలోనే అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చేసే నేత‌లు ఉన్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోస‌మే కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నాన‌ని కొంద‌రు ఆరోపిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న రాజీనామాతో మునుగోడుకు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలవాలనేది ప్రజలే నిర్ణయిస్తారని రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.


More Telugu News