నేష‌న‌ల్ హెరాల్డ్ కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు

  • ఢిల్లీలోని 12 కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు
  • కోల్ క‌తా కేంద్రంగా 2 చోట్ల ఈడీ దాడులు
  • ఇప్ప‌టికే ముగిసిన రాహుల్‌, సోనియాల ఈడీ విచార‌ణ‌
కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీల‌ను కోర్టులు, ద‌ర్యాప్తు సంస్థ‌ల విచార‌ణ‌ల దాకా తీసుకువ‌చ్చిన ఆ పార్టీ ప‌త్రిక నేష‌న‌ల్ హెరాల్డ్ వ్య‌వ‌హారంలో మంగ‌ళ‌వారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. దేశ రాజ‌ధాని ఢిల్లీ కేంద్రంగా న‌డిచిన నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌కు చెందిన కార్యాల‌యాల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సోమ‌వారం దాడులు చేశారు. ఢిల్లీలోని ఆ సంస్థ‌కు చెందిన 12 కార్యాల‌యాలతో పాటుగా కోల్‌క‌తాలోని 2 కార్యాల‌యాల్లో కూడా మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఈడీ సోదాలు జ‌రుగుతున్నాయి.

ఈ కేసులో ఇటీవ‌లే తొలుత రాహుల్ గాంధీ, ఆ త‌ర్వాత సోనియా గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. రాహుల్ గాంధీని 5 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు సోనియాను 3 రోజుల పాటు విచారించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే దిశ‌గా ఓ ప‌త్రిక‌ను న‌డ‌పాల‌న్న ఉద్దేశంతో గ‌తంలో భార‌త మాజీ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌ను స్థాపించారు. ఈ ప‌త్రిక నిర్వ‌హ‌ణ కోసం యంగ్ ఇండియా పేరిట ఓ సంస్థ‌ను కూడా ఆయ‌న ఏర్పాటు చేశారు. ఈ సంస్థ‌కు చెందిన ఆస్తుల‌ను రాహుల్ గాంధీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా దారి మళ్లించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈడీ విచార‌ణ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.


More Telugu News