విండీస్‌తో రెండో టీ20.. ఐదు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా

  • సమష్టిగా రాణించి విజయాన్ని అందుకున్న విండీస్ 
  • సిరీస్ 1-1తో సమం
  • ఆరు వికెట్లు పడగొట్టి భారత్‌ బ్యాటింగ్‌ను దెబ్బకొట్టిన మెక్ కాయ్
  • నేడు మూడో వన్డే
తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి విండీస్ బదులు తీర్చుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి జరిగిన రెండో టీ20లో విండీస్ విజయం సాధించి సిరీస్ 1-1తో సమం చేసింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 138 పరుగులకు ఆలౌట్ అయింది. గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ (11), శ్రేయాస్ అయ్యర్ (10), రిషభ్ పంత్ (24), రవీంద్ర జడేజా (27), దినేశ్ కార్తీక్ (7) క్రీజులో కుదురుకోలేక వికెట్లు సమర్పించుకున్నారు. హార్దిక్ పాండ్యా 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ 4 ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకుని భారత్ పతనాన్ని శాసించాడు. హోల్డర్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 139 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బ్రాండన్ కింగ్ అర్ధ సెంచరీతో విజయానికి బాటలు వేశాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. డెవోన్ థామస్ 19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఇక చివరి ఓవర్‌లో ఆతిథ్య జట్టు విజయానికి పది పరుగులు అవసరం కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే, థామస్ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అవేశ్ ఖాన్ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతి నోబాల్ కావడంతో స్మిత్ ఒక పరుగు తీశాడు. దీంతో రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి బంతిని థామస్ సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని బౌండరీకి తరలించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 నేడు జరగనుంది. ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెక్ కాయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.


More Telugu News