నా నియోజకవర్గంలో నా బెండు తీసే పరిస్థితి ఉండదు: మంత్రి అంబటి రాంబాబు

  • 'గడప గడపకు...' కార్యక్రమంలో పాల్గొన్న అంబటి
  • అంబటిపై మహిళలు తిరగబడ్డారంటూ వార్తలు
  • దుష్ట చతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తోందన్న మంత్రి 
ఇవాళ ఈటీవీ, టీవీ5, ఏబీఎన్ చానళ్లలోనూ, టీడీపీకి సంబంధించిన వెబ్ సైట్లలోనూ తనపై ఓ వార్తను పదేపదే ప్రచారం చేశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. "గడప గడపకు.. కార్యక్రమంలో అంబటి రాంబాబుపై మహిళలు తిరగబడ్డారు" అనేది ఆ వార్త సారాంశం అని వివరించారు. అంబటి రాంబాబును మహిళలు నిలదీశారని, బెండు తీశారని ప్రసారం చేస్తూ శునకానందం పొందారని అంబటి రాంబాబు మండిపడ్డారు.  

"ఇవాళ నా నియోజకవర్గంలో రాజుపాలెం గ్రామంలో గడప గడపకు.. కార్యక్రమంలో భాగంగా 375 ఇళ్లు తిరిగాను. వారికి కార్డులు, పింఛన్లు పంపిణీ చేశాను. టీడీపీకి చెందిన ఒక వ్యక్తి, జనసేనకు చెందిన మరో వ్యక్తి మాత్రం నన్ను అభాసుపాలుచేయడానికి ప్రయత్నించారు. వాళ్లు చేశారు అనడం కంటే ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం వాళ్లు ముందే వెళ్లి వాళ్లకు చెప్పి రెచ్చగొట్టి, కెమెరాలు సిద్ధం చేసి ఇదంతా చేసినట్టుగా అనిపిస్తోంది. 

అక్కడ పెద్ద గొడవ జరగలేదు, నా బెండు తీయడం జరగలేదు. నా నియోజకవర్గంలో నా బెండు తీసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చిత్తశుద్ధితో పాలన అందిస్తున్నాం. ఈ సందర్భంగా దుష్ట చతుష్టయానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ల ప్రసార మాధ్యమాల్లో నాకోసం స్థలం కేటాయించి వార్తలు రాస్తున్నారంటే మెచ్చుకోవాల్సిందే. అయితే వాళ్లు ఎప్పటికీ పాజిటివ్ వార్తలు వేయరు, నెగెటివ్ వార్తలే" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.


More Telugu News