విశాఖలో ఇళ్ల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందించాలి: సీఎం జగన్

  • గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • హాజరైన ఉన్నతాధికారులు
  • అధికారులకు సీఎం దిశానిర్దేశం
  • సీఎంకు వివరాలు తెలిపిన అధికారులు
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమానికి ఏపీ సీఎస్ సమీర్ శర్మ, ఏపీఎస్ హెచ్ సీఎల్ చైర్మన్ దొరబాబు, గృహనిర్మాణ శాఖ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ, జగనన్న కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెరగాలని, విశాఖలో సాధ్యమైనంత త్వరగా ఇళ్ల పనులను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని పేర్కొన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

అటు, టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సీఎం జగన్ చర్చించారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరపాలని ఆదేశించారు. ఇంకా 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాల కార్యక్రమానికి సంబంధించిన వివరాలను కూడా సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

అందుకు అధికారులు బదులిస్తూ, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 2,03,920 మందిని అనర్హులుగా గుర్తించినట్టు సీఎంకు నివేదించారు. ఇప్పటివరకు లక్ష మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, మిగిలిన పట్టాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. 

ఇక, విశాఖలో 1.24 లక్షల ఇళ్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అక్టోబరు చివరినాటికి గృహ నిర్మాణాలు ప్రారంభం అవుతాయని సీఎంకు వివరించారు. ఆప్షన్-3 కింద ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణాలు కూడా వేగం పుంజుకున్నాయని తెలిపారు.


More Telugu News