సముద్రంలో బోట్ ను చుట్టుముట్టిన జెల్లీ ఫిష్ లు.. ఆకాశంలో చుక్కల్లా ఆకట్టుకుంటున్న వీడియో

  • ఇజ్రాయెల్ సముద్ర తీరంలో కనిపించిన అరుదైన దృశ్యం
  • వేల సంఖ్యలో జెల్లీ ఫిష్ లు ఒకే చోట చేరిన వైనం 
  • డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఇజ్రాయెల్ అధికారులు
  • హిందూ మహా సముద్ర ప్రాంతం నుంచి ఏటా అక్కడికి వలస వస్తాయని వెల్లడి
సముద్రంలో ఓ బోటు ప్రయాణిస్తోంది.. కాసేపటికి సముద్రాన్ని పరిశీలిస్తే.. బోటు చుట్టూ పాల నురగలా తెల్లని చుక్కలు. ఏమిటా అని గమనిస్తే అన్నీ జెల్లీ ఫిష్ లు.. ఒకటి రెండు కాదు వేల సంఖ్యలో జెల్లీ ఫిష్ లు ఆకాశంలో చుక్కల్లా పరుచుకుని కనిపించాయి. ఇజ్రాయెల్ లోని హైఫా బే ప్రాంతంలోనిదీ దృశ్యం. ఆ ప్రాంతంలో ఏటా జెల్లీ ఫిష్ లు వలస వస్తుంటాయట. ఈసారి కూడా అలా కొన్ని జెల్లీ ఫిష్ లు కనిపించడంతో.. ఇజ్రాయెల్ కు చెందిన పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ విభాగం.. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించింది. ఈ వీడియోను తమ యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేసింది. ఈ జెల్లీ ఫిష్ లకు సంబంధించిన వివరాలనూ వెల్లడించింది.
  • నిజానికి ఈ జెల్లీ ఫిష్ లు చాలా వరకు హిందూ మహా సముద్ర ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సమీపంలోని మధ్యధరా సముద్ర ప్రాంతానికి ఏటా వలస వస్తాయని అధికారులు తెలిపారు. 
  • భూమ్మీద మొట్టమొదట పుట్టిన జీవ రాశుల్లో జెల్లీ ఫిష్ లు కూడా ఒకటని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సముద్ర ప్రాంతాల్లో వివిధ రకాల జెల్లీ ఫిష్ లు జీవిస్తున్నాయని వివరించారు.
  • జెల్లీ ఫిష్ లు పేరులో ఫిష్ అని ఉన్నా అవి చేపలు కాదు. పూర్తిగా భిన్నమైన ప్రాణులు. వాటికి మెదడు ఉండదు. శరీరంలో 95 శాతానికిపైగా నీరే ఉంటుంది.
  • కొన్ని రకాల జెల్లీ ఫిష్ లు అత్యంత విష పూరితమైనవి. వాటికి ఉండే టెంటకిల్స్ ను తాకితే తీవ్ర స్థాయిలో ప్రమాదకరం కూడా అవుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలూ కూడా పోయే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • చిత్రమైన విషయం ఏమిటంటే.. సాధారణంగా కాలుష్యం వల్ల సముద్రాల్లో ఇతర జీవ రాశులకు నష్టం కలుగుతుంటే.. జెల్లీ ఫిష్ లకు మాత్రం అది అనుకూలమని, దాంతో వాటి సంతతి భారీగా పెరుగుతోందని అంటున్నారు.



More Telugu News