‘కరోనా’ పేరిట అసత్య ప్రకటనలు.. కంపెనీలకు జరిమానాలు

  • కరోనా వైరస్ ను అంతం చేస్తాయంటూ మోసపూరిత ప్రకటనలు
  • తద్వారా విక్రయాలు పెంచుకునే వ్యాపార ఎత్తుగడలు
  • నోటీసులు జారీ చేసిన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ
కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న రోజులు అవి. విపత్కర పరిస్థితుల్లో కంపెనీలు విలువలు మరిచి వ్యాపార ప్రయోజనం ఆశించాయి. నిజాయతీ లేని, నిజం లేని ప్రకటనలతో వ్యాపారం పెంచుకునే చర్యలకు దిగాయి. తమ ఉత్పత్తులు కరోనా నుంచి రక్షణనిస్తాయంటూ ప్రకటనలు గుప్పించాయి. ఈ తరహా ప్రకటనలతో చట్ట నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ మొట్టికాయలు వేసింది.

ఇప్పటి వరకు 129 నోటీసులను ఆయా కంపెనీలకు జారీ చేసింది. ఇందులో 71 నోటీసులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకే జారీ చేయడం గమనార్హం. ‘‘కంపెనీలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా కింద జమ చేశాయి’’ అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. 

‘‘పేరొందిన బ్రాండ్ లు సైతం కరోనా రక్షణ ఇస్తాయంటూ అసంబద్ధ ప్రకటనలు ఇచ్చాయి. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఆందోళనలో ఉండడంతో ఈ కంపెనీలకు విక్రయాలు పెరిగాయి’’ అని ఖరే తెలిపారు. ఇలా జరిమానాలు చెల్లించిన కంపెనీల్లో పేరొందినవి 15 ఉన్నాయి. 

ఏషియన్ పెయింట్స్ కంపెనీ ప్రతి ఒక్కరికీ తెలుసు. ‘‘రాయల్ హెల్త్ షీల్డ్ బ్రాండ్ పేరుతో పెయింట్ ను విడుదల చేసింది. ఇందులో సిల్వర్ నానో టెక్నాలజీ ఉండడంతో పెయింట్ వేసిన 30 నిమిషాల నుంచే కరోనా వైరస్ ను బలంగా ఎదుర్కొంటుందని ప్రచారం చేసింది’’ అని ఖరే వివరించారు. కంపెనీ చెప్పినవి అసత్యమని తేలింది. దీంతో ఇచ్చిన నోటీసుపై ఏషియన్ పెయింట్స్ మళ్లీ అప్పీలు చేయకుండా, ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవడం గమనార్హం. 

మరో ప్రముఖ కంపెనీ బెర్జర్ పెయింట్స్ సైతం తానేమైనా తక్కువ తిన్నానా అన్నట్టు కరోనాకు సంబంధించిన ఇలాంటి ప్రకటనలే ఇచ్చింది. జొడియాక్ అప్పారెల్స్ అయితే తమ కంపెనీ షర్ట్ ధరిస్తే కరోనా వైరస్ ను 99 శాతం చంపేస్తుందని ప్రకటన ఇచ్చింది. ఇందులో ప్రత్యేకమైన టెక్నాలజీ వినియోగించినట్టు చెప్పింది. సియారామ్ అప్పారెల్స్ కూడా ఇలాంటి ప్రకటనతో విక్రయాలు పెంచుకోవాలని ప్రయత్నించింది. కెంట్ వాటర్ కంపెనీ తమ ఫిల్టర్ కరోనా వైరస్ ను ఫిల్టర్ చేస్తుందని ప్రకటించింది. బ్లూస్టార్ కంపెనీ కూడా తమ ఏసీలు కరోనా వైరస్ ను చంపేస్తాయని ప్రకటనలు ఇచ్చింది.


More Telugu News