టీ20ల్లో పాకిస్థాన్​ రికార్డుపై కన్నేసిన టీమిండియా!

  • నేడు వెస్టిండీస్ తో భారత్ రెండో టీ20
  • విండీస్ పై ఇప్పటిదాకా 14 సార్లు గెలిచిన టీమిండియా
  • 15 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా సోమవారం జరిగే రెండో మ్యాచ్ లో ఆతిథ్య జట్టుతో తలపడుతుంది. తొలి టీ20లో 68 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసిన రోహిత్ సేన జోరు మీద ఉంది. రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో  అర్ధ సెంచరీ సాధించగా.. దినేశ్ కార్తీక్ చివర్లో మెరుపు బ్యాటింగ్ తో భారత్ భారీ స్కోరు చేసింది. తర్వాత బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఘన విజయం సొంతమైంది. 

ఇప్పుడు ఇదే జోరుతో రెండో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ లో 2-0 తో ఆధిక్యం సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అదే సమయంలో ఈ ఫార్మాట్‌లో అరుదైన రికార్డు కూడా భారత్ ను ఊరిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే వెస్టిండీస్ పై అత్యధికంగా 15 విజయాలు సాధించిన జట్టుగా భారత్.. పాకిస్థాన్ రికార్డును సమం చేస్తుంది. వెస్టిండీస్ తో పాక్ ఇప్పటివరకు 21 టీ20 మ్యాచ్ లు ఆడి 15 విజయాలు నమోదు చేసింది. ఇక వెస్టిండీస్ తో ఆడిన 21 టీ20ల్లో ఇండియా ఇప్పటివరకు 14 సార్లు గెలిచింది. సోమవారం జరిగే మ్యాచ్ లో కూడా గెలిస్తే కరీబియన్ జట్టుపై భారత్ 15 విజయాలతో పాక్ రికార్డును సమం చేస్తుంది.  

ఓవరాల్ గా ఈ ఫార్మాట్ లో ఒక ప్రత్యర్థిపై ఓ జట్టుకు ఇది మూడో అత్యధిక విజయాల రికార్డు కానుంది. శ్రీలంకపై 17 విజయాలతో భారత్ మొదటి స్థానంలో ఉంది. పాకిస్థాన్.. జింబాబ్వేపై 16 సార్లు, న్యూజిలాండ్ పై 15 సార్లు గెలిచింది. మరోవైపు వెస్టిండీస్ జట్టుపై భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది.  


More Telugu News