అప్పట్లో వారానికి ఒకసారి వచ్చే 'రత్తాలు-రాంబాబు' కోసం ఎదురుచూసేవాళ్లం: సీజేఐ ఎన్వీ రమణ

  • విశాఖలో రావిశాస్త్రి శతజయంతి ఉత్సవాలు
  • ముఖ్య అతిథిగా హాజరైన ఎన్వీ రమణ
  • పూర్ణకుంభ స్వాగతం పలికిన రసజ్ఞ వేదిక
  • రావిశాస్త్రి ఘనతలను ప్రస్తావించిన ఎన్వీ రమణ
ప్రముఖ రచయిత రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) శతజయంతి ఉత్సవాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఎన్వీ రమణకు అంకోసా హాల్ లో రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణను రావిశాస్త్రి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. 

రావిశాస్త్రికి నివాళులు అర్పించిన ఎన్వీ రమణ మాట్లాడుతూ, విశాఖ జిల్లా తెలుగుజాతికి గొప్ప కవులను అందించిందని అన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రావిశాస్త్రి యారాడకొండపై రచన చేసి విశాఖపై తన మక్కువ చాటుకున్నారని వెల్లడించారు. రచయితగా ఆయన సృష్టించిన పాత్రలు చట్టాలు, శాసన వ్యవస్థల గురించి మాట్లాడాయని, వ్యవస్థలపై నమ్మకం పోతే ఏమవుతుందో తన రచనల్లో వివరించారని అన్నారు. సవ్యరీతిలో లేని, సరిగ్గా అమలుకాని చట్టాల గురించి తన రచనల్లో చెప్పారని అన్నారు. 

న్యాయశాఖపై రావిశాస్త్రి చక్కని కవితలు చెప్పారని కొనియాడారు. ఆరు సారాకథలు చదివితే న్యాయవ్యవస్థను అర్థం చేసుకోగలమని అభిప్రాయపడ్డారు. ఆరు సారాకథలు పుస్తకాలను అనేకమంది మిత్రులకు ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. రావిశాస్త్రి తన రచనల్లో ప్రజల కష్టాలను, వారి జీవితాలను వివరించారని తెలిపారు. అప్పట్లో వారానికి ఒకసారి వచ్చే 'రత్తాలు-రాంబాబు' కోసం ఎదురుచూసేవాళ్లమని ఎన్వీ రమణ వెల్లడించారు. 

శతాబ్దాల కిందట ఒక రావి చెట్టు గౌతముడిని ప్రభావితం చేసిందని, ఈ శతాబ్దంలో ఒక 'రావి' సమాజాన్ని ప్రభావితం చేసిందని వ్యాఖ్యానించారు. రావిశాస్త్రి రచనలను ఆంగ్లంలోకి అనువదించాలనే కోరిక ఉందని సీజేఐ మనసులో మాట వెల్లడించారు. పదవీ విరమణ చేసిన తర్వాత రావిశాస్త్రి, శ్రీశ్రీ సాహిత్యంపై పనిచేస్తానని వెల్లడించారు. భాష లేనిదే బతుకు లేదని, తెలుగు భాషను కాపాడాలని పిలుపునిచ్చారు. మాండలికాలను రక్షించుకుంటేనే భాషను రక్షించుకున్నట్టు అని స్పష్టం చేశారు.


More Telugu News