స్మృతి మంధన దూకుడు... కామన్వెల్త్ క్రికెట్లో దాయాదిని దంచికొట్టిన భారత అమ్మాయిలు

  • బర్మింగ్ హామ్ లో మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్
  • 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్
  • 11.4 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
  • స్మృతి మంధన దూకుడు
  • టీమిండియా సెమీస్ ఆశలు సజీవం
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా బర్మింగ్ హామ్ లో పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ గ్రూప్-ఏ మ్యాచ్ లో టీమిండియా మహిళలు 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేశారు. 100 పరుగుల విజయలక్ష్మాన్ని కేవలం 11.4 ఓవర్లలోనే ఛేదించారు. 

డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. స్మృతి మంధన 42 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె స్కోరులో 8 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 16 పరుగులు చేసి అవుట్ కాగా, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి మంధన స్కోరుబోర్డు ముందుకు నడిపించింది. మేఘన 14 పరుగులు చేసింది. 

అంతకుముందు, వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. సరిగ్గా 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. అటు, వరుసగా రెండో ఓటమితో పాక్ జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. భారత్ అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్ ను ఆగస్టు 3న బార్బడోస్ జట్టుతో ఆడనున్నారు.


More Telugu News