అమెరికా అధ్యక్షుడు బైడెన్​ కు మళ్లీ కరోనా

  • వైరస్ నుంచి కోలుకున్నట్టు ప్రకటించిన వైట్ హౌస్
  • మూడు రోజుల్లోనే మళ్లీ పాజిటివ్ గా తేలిన వైనం 
  • స్వల్ప లక్షణాలతో మళ్లీ ఐసోలేషన్లోకి వెళ్లిన బైడెన్
అగ్రరాజ్యం అమెరికా అధ‍్యక్షుడు జో బైడెన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. ఈ నెల 22న బైడెన్ తొలిసారి పాజిటివ్ గా తేలారు. అయితే, చికిత్స తర్వాత కొవిడ్‌ నుంచి బైడెన్‌ పూర్తిగా కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ మూడురోజుల కిందనే ప్రకటించింది. కానీ, తాజాగా  నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు మళ్లీ పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో అమెరికా అధ్యక్షుడు మరోసారి ఐసోలేషన్‌కు వెళ్లారు. 

బైడెన్ కు స‍్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షుడి వైద్యుడు కెవిన్‌ ఓ కానర్‌ తెలిపారు. బైడెన్‌కు గత శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందన్నారు. వరుసగా నాలుగు రోజులు నెగెటివ్‌గా తేలిన తర్వాత మళ్లీ పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ ఐసోలేషన్‌ నిబంధనలు పాటిస్తున్నారని వెల్లడించారు. బైడెన్ కు అత్యవసర చికిత్స అందించాల్సిన లక్షణాలేమీ కనిపించలేదన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.


More Telugu News