ఊబర్ డ్రైవర్ రైడ్ ను రద్దు చేయడం కుదరదిక!

  • ముందే అన్ని వివరాలు డ్రైవర్ కు తెలిసేలా ఏర్పాటు
  • ట్రిప్ లొకేషన్, ఎంత చార్జీ వివరాలు డ్రైవర్ కు కనిపిస్తాయ్
  • దీంతో ఇష్టమైతేనే ట్రిప్ ను ఆమోదించొచ్చు
  • కొన్ని పట్టణాల్లో పరీక్షించి చూసిన ఊబర్
ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుని వస్తుంది కదా అని వేచి చూస్తుంటే, డ్రైవర్ ఆ ట్రిప్ రద్దు చేయడం.. మళ్లీ ఊబర్ మరో క్యాబ్ కు కనెక్ట్ చేయడం, ప్రతి యూజర్ కు ఒక్కసారైనా అనుభవం అయి ఉంటుంది. ఇలా ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ట్రిప్ లను ఏకపక్షంగా రద్దు చేయడం వల్ల అత్యవసరంగా ప్రయాణం చేయాలని చూసే వారికి అసహనం, కోపానికి గురి చేస్తుంది. దీంతో ఈ తరహా చర్యలను నివారిస్తూ ఊబర్ కొత్త అప్ డేట్ లను ఆచరణలోకి తీసుకురానుంది. 

రైడ్ బుక్ చేసుకున్న తర్వాత డ్రైవర్ కాల్ చేసి, లొకేషన్ అడగడం కూడా యూజర్లకు అనుభవమే. వారికి లాభసాటి అనుకున్న రూట్లో అయితే ఓకే, లేదంటే ఆ ట్రిప్ ను రద్ధు చేస్తుంటారు. డ్రైవర్ల తీరుతో వినియోగదారుల విలువైన సమయం వృధా అవుతుంటుంది. అంతేకాదు, క్యాష్ పేమెంట్ అయితేనే వస్తామంటారు. రానున్న అప్ డేట్స్ తో డ్రైవర్ల ఆటను ఊబర్ కట్టించనుంది. 

ఇందులో భాగంగా ట్రిప్ తోపాటు, ఫేర్ (చార్జీ) ఎంతో కూడా ఊబర్ ముందుగానే ట్యాక్సీ డ్రైవర్ కు చూపిస్తుంది. దీంతో అది లాభసాటియేనా, కాదా వారికి ముందే తెలిసిపోతుంది. దీంతో ఇష్టమైతేనే ఆ ట్రిప్ ను ఆమోదిస్తారు. అనవసర రద్ధులు ఉండవు. సదరు ట్రిప్ లొకేషన్ ఎక్కడ, ఎంత చార్జీ, ఏ రూపంలో చెల్లిస్తారనే విషయాలను ముందే డ్రైవర్లకు కనిపించేలా ఊబర్ చర్యలు తీసుకుంటోంది. ముందే అన్ని వివరాలు తెలియడం వల్ల రద్ధులు తగ్గిపోతాయని ఊబర్ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. ఊబర్ కొన్ని పట్టణాల్లో ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లను పరీక్షించి చూసింది. డ్రైవర్ల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయింది. దీంతో వీటిని అన్ని పట్టణాల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది.


More Telugu News