కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో పసిడి తెచ్చిన మీరాబాయి చాను

  • మొత్తంగా 201 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించిన మీరాబాయి చాను
  • వ్యక్తిగత జాతీయ రికార్డును సమం చేసిన చాను
  • కామన్వెల్త్‌లో చానుకు ఇది మూడో పతకం
  • గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన మణిపురి క్వీన్
  • భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి రోజు నుంచే అదరగొడుతున్న భారత అథ్లెట్లు నిన్న పతకాల వేట ప్రారంభించారు. పురుషుల విభాగంలో ఒక రజతం, ఒక కాంస్యం రాగా, మణిపూర్ వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను ఏకంగా పసిడి పతకాన్ని అందించింది. 49 కేజీల విభాగంలో డిఫెండింగ్ క్వీన్‌గా బరిలోకి దిగిన మీరాబాయి కామన్వెల్త్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 49 కేజీల విభాగంలో రికార్డు స్థాయిలో 201 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం సాధించింది. స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 84 కేజీలు ఎత్తిన చాను.. రెండో ప్రయత్నంలో  88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు మొత్తం 201 కేజీలతో చాంపియన్‌గా అవతరించింది. ఫలితంగా వ్యక్తిగత జాతీయ రికార్డును సమం చేసింది. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో చాను రజత పతకం గెలుచుకుంది.

నిజానికి మూడో ప్రయత్నంలో 90 కేజీలపై గురిపెట్టినప్పటికీ విఫలమైంది. స్నాచ్ మిగిలిన తర్వాత ప్రత్యర్థుల కంటే 12 కిలోల ఆధిక్యంతో ఉన్న చాను.. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలో 109 కిలోలు, రెండో ప్రయత్నంలో 113 కిలోలు అలవోకగా ఎత్తేసింది. మూడో ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తాలని లక్ష్యంగా పెట్టుకున్నా సఫలం కాలేకపోయింది. రెండో స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు, చానుకు మధ్య ఏకంగా 29 కేజీల తేడా ఉండడం గమనార్హం. మారిషస్‌కు చెందిన హన్రిత (172 కేజీలు), కెనడాకు చెందిన కమిన్‌స్కి (171 కేజీలు) వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం సొంతం చేసుకున్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో చానుకు ఇది మూడో పతకం కావడం గమనార్హం.

అంతకుముందు మహారాష్ట్రకు చెందిన సంకేత్ రజతం సాధించి భారత్‌కు తొలి పతకం అందించగా,  కర్ణాటక లిఫ్టర్ గురురాజ పుజారి కాంస్యం సాధించి రెండో పతకం అందించాడు. మీరాబాయి చాను స్వర్ణంతో మెరిసి ముచ్చటగా మూడో పతకాన్ని భారత్‌ ఖాతాలో వేసింది. 11 స్వర్ణాలు సహా 25 పతకాలు సాధించిన ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.


More Telugu News