మరాఠీ ప్రజలను అవమానించారు: గవర్నర్ కోష్యారీపై ఉద్ధవ్ థాకరే మండిపాటు

  • గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే మహారాష్ట్రలో డబ్బులు ఉండవన్న కోష్యారీ
  • ముంబై ఆర్థిక రాజధాని హోదాను కోల్పోతుందని వ్యాఖ్య
  • హిందువుల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారన్న థాకరే
గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించి వేస్తే ముంబైలో డబ్బు మిగలదని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల వాళ్లు వెళ్లిపోతే ముంబై ఆర్థిక రాజధాని హోదాను కోల్పోతుందని ఆయన అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. మరాఠీ ప్రజలు, మరాఠా గౌరవాన్ని కించపరిచేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. హిందువుల మధ్య చిచ్చుపెట్టేలా కోష్యారీ మాట్లాడారని అన్నారు. గవర్నర్ ను ఇంటికి పంపుతారా? లేక జైలుకు పంపుతారా? అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోష్యారీ వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. 

కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న సమయంలో, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో దేవాలయాలను గవర్నర్ హడావుడిగా తెరిపించారని థాకరే విమర్శించారు. గతంలో ఆయన సావిత్రిబాయ్ పూలేను అవమానించారని, ఇప్పుడు మరాఠీ బిడ్డలను అగౌరవపరిచారని మండిపడ్డారు.


More Telugu News