మహారాష్ట్రలో కొత్త చిచ్చురేపిన రాష్ట్ర గవర్నర్​ వ్యాఖ్యలు!

  • గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే మహారాష్ట్రలో పైసా మిగలదన్న గవర్నర్ కొష్యారి  
  • మరాఠీలను గవర్నర్ అవమానించారని శివసేన, కాంగ్రెస్ నేతల ఆగ్రహం
  • రాజీనామా చేయాలని డిమాండ్
  • ఆ ఉద్దేశంతో మాట్లాడలేదంటూ గవర్నర్ వివరణ
మొన్నటిదాకా శివసేన పార్టీలో కుమ్ములాటలు, అధికార మార్పిడితో వార్తల్లో నిలిచిన మహారాష్ట్రలో ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. ముంబై, థానే నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే మహారాష్ట్రలో డబ్బులే ఉండవని, దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోతుందని కోష్యారీ చేసిన వాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 

శుక్రవారం ముంబైలోని అంధేరీలో ఓ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ మాట్లాడుతూ, ‘గుజరాతీలు మరియు రాజస్థానీలను మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబై, థానే నుంచి బయటకు పంపిస్తే ఇక్కడ పైసా మిగలదని నేను ప్రజలకు చెబుతూ ఉంటాను. అదే జరిగితే భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై ఇకపై అలా ఉండబోదు’ అని అన్నారు. 

ఈ వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. గవర్నర్ కామెంట్లు కష్టపడి పని చేసే మరాఠీ ప్రజలను అవమానించేవిగా ఉన్నాయన్నారు. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండేకు కూడా ఇది అవమానం అన్నారు. మహారాష్ట్ర, మరాఠీ ప్రజలు బిచ్చగాళ్లని భావించేలా గవర్నర్‌ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సీఎం షిండేకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా.. గవర్నర్‌తో తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం వీడియోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ కూడా తీవ్రంగా స్పందించారు. ఒక రాష్ట్ర గవర్నర్ అదే రాష్ట్ర ప్రజల పరువు తీయడం దారుణమైన విషయం అన్నారు. 

మహారాష్ట్ర ప్రజల శ్రమను అవమానించినందుకు గవర్నర్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. ‘రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అహోరాత్రులు శ్రమించిన మహారాష్ట్ర ప్రజలు, మరాఠీలకు ఇది అవమానం. గవర్నర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో ఆయనను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తాం. సీఎం, డిప్యూటీ సీఎం, మహారాష్ట్ర క్యాబినెట్ కు ఇది ఓకేనా? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ఆమె ప్రశ్నించారు. 

తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని గవర్నర్‌ కొష్యారి వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర అభివృద్ధిలో రాజస్థాన్, గుజరాత్ ప్రజల సహకారం గురించి చెప్పేందుకే అలా మాట్లాడానని తెలిపారు. మహారాష్ట్రను ఈ స్థాయిలో నిలపడానికి మరాఠీలు ఎంతో కష్టపడ్డారన్నారు. వాళ్లను కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.


More Telugu News