కాంగ్రెస్‌కు టాటా చెప్పేందుకే రాజగోపాల్‌రెడ్డి మొగ్గు.. బీజేపీలో చేరుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు

  • సొంత ప్రయోజనాలు, పదవులు తన లక్ష్యం కాదన్న రాజగోపాల్‌రెడ్డి
  • తన నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారన్న కాంగ్రెస్ నేత
  • కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే
తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తప్పదనిపిస్తోంది. పార్టీని వీడాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చివరికి పార్టీకి గుడ్‌బై చెప్పేందుకే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 

మాట్లాడుకుందాం రమ్మంటూ పార్టీ అధిష్ఠానం ఆహ్వానించినా ఆయన ఢిల్లీకి వెళ్లలేదు. సొంత ప్రయోజనాలు, పదవులు తన లక్ష్యం కాదన్న ఆయన.. తన నిర్ణయాన్ని మునుగోడు ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా తాను పార్టీని వీడి బీజేపీలో చేరడం ఖాయమన్న స్పష్టమైన సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా మునుగోడు వేదికగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలోని మేధావుల నుంచి విద్యార్థి, ఉద్యోగ సంఘాలన్నీ తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజగోపాల్ తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడుపై కేసీఆర్ కక్ష కట్టారని, అందుకనే ఇక్కడ అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని అన్నారు. 2014 కంటే ముందే 90 శాతం పూర్తయిన ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టులను నిలిపివేశారని ఆరోపించారు. కిష్టరాయినిపల్లి భూ నిర్వాసితులు పరిహారం అడిగితే అక్రమ కేసులు బనాయించారని రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News