మీకు నచ్చే వరకు చిత్రాలు చేస్తూనే ఉంటాం: 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్

  • కల్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార'
  • హైదరాబాదులో ప్రీరిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ 
  • ఆగస్టు 5న విడుదల
నందమూరి కల్యాణ్ రామ్, కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటించిన చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. కల్యాణ్ రామ్ సోదరుడు, టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రసంగిస్తూ... ఒకరోజు కల్యాణ్ అన్న ఓ ఇంట్రస్టింగ్ కథ విన్నానంటూ ఫోన్ చేశాడని వెల్లడించారు. దర్శకుడు వశిష్ఠ గురించి తనకు ముందే తెలుసని, అతడిని వేణు అని పిలవడమే తనకు ఇష్టమని తెలిపారు. 

మొదట ఒక ఐడియాగా బింబిసార కథ చెప్పాడని, కానీ అనుభవం లేకపోయినా ఇంత పెద్ద చిత్రాన్ని ఎంతో కసితో తెరకెక్కించాడని కొనియాడారు. ఇది ఏమంత సులభమైన వ్యవహారం కాదని అన్నారు. ఈ సినిమాను చూసి ఎంతో ఉద్విగ్నతకు గురయ్యానని, రేపు థియేటర్లలో ప్రేక్షకులు కూడా అదే ఉద్విగ్నతకు గురవుతారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దర్శకుడు వశిష్ఠ నుంచి ఎన్ని గొప్ప చిత్రాలు రానున్నాయో చెప్పేందుకు బింబిసార ఒక ట్రైలర్ వంటిదని కొనియాడారు. 

కెమెరామన్ చోటా కె నాయుడు ఈ చిత్రానికి తన విజువల్స్ తో ప్రాణం పోశాడని ప్రశంసించారు. ఈ చిత్రం కోసం ఎంతో కృషి చేసిన టెక్నీషియన్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. బింబిసార చిత్రం గురించి తాము మాట్లాడుకునే సమయంలో ఓ వెలితి కనిపించేదని, కీరవాణితో ఆ వెలితి భర్తీ అయిందని వివరించారు. మామూలుగా సినిమా విడుదల అవుతుందంటే ఎవరికైనా భయం ఉంటుందని, కానీ కీరవాణి సంగీతం కారణంగా తమకు ఆ భయంలేదని, ఆయన అంత అద్భుతమైన సంగీతం అందించారని ఎన్టీఆర్ వెల్లడించారు. 

మీకు నచ్చే వరకు చిత్రాలు చేస్తూనే ఉంటామని గతంలో చెప్పానని, మీకు నచ్చకపోతే మరొకటి, అది నచ్చకపోతే మరొకటి చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ సినిమాతో కల్యాణ్ అన్న గురించి గర్వంగా ఫీలవుతారని అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కల్యాణ్ అన్న కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే బింబిసారకు ముందు, బింబిసార తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కల్యాణ్ రామ్ కాకుండా మరెవ్వరూ బింబిసారకు న్యాయం చేయలేరని వ్యాఖ్యానించారు. 

బింబిసారతో పాటు 'సీతారామం' అనే చిత్రం కూడా వస్తోందని, ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తమ తాత, తండ్రి వదిలి వెళ్లిన అభిమానులు మీరు... ఆస్తుల కంటే ఎక్కువ మీరు అంటూ వ్యాఖ్యానించారు. ఇళ్లకు జాగ్రత్తగా వెళ్లాలంటూ సూచించారు. 

అంతకుముందు, హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తన తమ్ముడు ఎన్టీఆర్ కు థ్యాంక్స్ చెప్పబోనంటూ, లవ్యూ అంటూ సోదరుడిపై తన ప్రేమను ప్రదర్శించారు. గతంలో తమ తాత ఎన్టీఆర్ గారు పాతాళభైరవి వంటి చిత్రాన్ని తీశారని, బాబాయి బాలకృష్ణ భైరవదీప్వం అందించారని, చిరంజీవి గారు జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం చేశారని, ఇప్పుడదే కోవలో బింబిసార చిత్రం చేశానని కల్యాణ్ రామ్ వెల్లడించారు. 

ఆగస్టు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు. తప్పకుండా థియేటర్లకు వెళ్లి సినిమా చూసి తమను ఆదరిస్తారని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అభిమానులను నిరాశపర్చనని, అభిమానులు 200 శాతం సంతృప్తి వ్యక్తం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News