చికెన్​, మటన్​.. రెండింటిలో ఏది బెటర్​? పోషకాహార నిపుణుల సూచనలివీ..!

  • రెండింటిలోనూ కొవ్వు పదార్థాలు ఎక్కువే 
  • చికెన్ కు అయితే బ్రెస్ట్ లో.. మటన్ లో అయితే చాప్స్ లో కొవ్వు తక్కువ
  • అయితే మాంసాహారం ఏదైనా పరిమితికి లోబడి తీసుకోవడం మంచిదని సూచన
మాంసాహారం తినే వారిలో ఎప్పుడూ ఒక సందేహం వేధిస్తూనే ఉంటుంది. మటన్, చికెన్ లలో ఏది బెటర్ అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. కొందరేమో చికెన్ తింటే మంచిదని, మటన్ ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు.. మరికొందరు చికెన్ తో వేడి అనీ, మటన్ అయితేనే బెటర్ అని అంటుంటారు. ఇవన్నీ విని గందరగోళంలో పడిపోవడం మన వంతు అవుతుంది. అయితే రెండింటిలోనూ మంచి, చెడు ఉన్నాయని.. అది ఎలా తీసుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు పూజా మల్హోత్రా చెబుతున్న వివరాల ప్రకారం..

  • సాధారణంగా చికెన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని.. మటన్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి మొత్తంగా చూస్తే ఇది నిజమేనని నిపుణులు చెబుతున్నారు. 
  • మటన్ చాప్స్ (ఉదర భాగంలోని పక్కటెముకలతో కూడిన ముక్కలు)లో తక్కువ కొవ్వు ఉంటుందని.. ఈ భాగంలోని మటన్ తో కేలరీలు తక్కువగా ఉంటాయని, చికెన్ తో పోలిస్తే ప్రోటీన్లు కూడా స్వల్పంగా ఎక్కువగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.
  • చికెన్ తో పోలిస్తే.. మటన్ చాప్స్ లో ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయని, సోడియం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీనితో మంచి పోషకాలు అందుతాయని అంటున్నారు.
  • చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువే అయినా.. అందులోని కొన్ని భాగాలు మాత్రమే మేలు చేస్తాయని, మిగతా భాగాలు ఆరోగ్యకరం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
  • చికెన్ లో బ్రెస్ట్ పీస్ కంటే.. దిగువ భాగంలో, ముఖ్యంగా లెగ్ పీసెస్ తోపాటు వింగ్స్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. అందువల్ల చికెన్ తినేవారు బ్రెస్ట్ పీస్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని అంటున్నారు.
  • మటన్ లో కూడా బాగా ఎరుపు రంగులోకి వచ్చిన ముదురు మాంసం కంటే.. లేత మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ చాప్స్ తీసుకుంటే ఇబ్బంది ఉండదని అంటున్నారు.
  • మాంసాహారంలో చేపలు తీసుకోవడం ఉత్తమమని.. మటన్ లో అయితే చాప్స్, చికెన్ లో అయితే బ్రెస్ట్ భాగం బెటరని నిపుణులు వివరిస్తున్నారు.

పరిమితి పాటించడం మేలు
అయితే మాంసాహారం ఏదైనా సరే శరీరానికి అత్యధిక కేలరీలు అందుతాయని.. ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మటన్, చికెన్ వంటివి తినాలన్న కోరికను అణచుకోవాల్సిన అవసరం లేదని.. కొద్దిమొత్తంలో తీసుకోవచ్చని వివరిస్తున్నారు. దీనివల్ల శరీరానికి అవసరమైన ఐరన్, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానికి అందుతాయని చెబుతున్నారు.


More Telugu News