కేంద్ర నిధులు ఏమయ్యాయో తేల్చాల్సి ఉంది.. టీఆర్ఎస్ నేతలు తప్పు చేయనప్పుడు భయమెందుకు?: జ్యోతిరాదిత్య సింధియా

  • మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా సాయం చేస్తోందన్న జ్యోతిరాదిత్య 
  • కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలోనే తెలంగాణకు అధికంగా నిధులు వచ్చాయని.. అయితే ఆ నిధులు సద్వినియోగం అయ్యాయా, దుర్వినియోగం అయ్యాయా.. అనేది తేల్చాల్సి ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా సాయం చేస్తోందని.. కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని ఆరోపించారు. తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ అంటే భయమెందుకని నిలదీశారు.

తెలంగాణలో అధికారం బీజేపీదే..
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తిరోగమనంలో ఉందని.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. తెలంగాణలో రోజురోజుకు ప్రజల్లో బీజేపీ, మోదీ పట్ల ఆదరణ పెరుగుతోందని.. రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందని.. ప్రతి బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని సింధియా తెలిపారు.


More Telugu News