​ కేజ్రీవాల్, కేంద్రం మధ్య 'విదేశీ ప్రయాణం' జగడం!

  • సింగపూర్ లో ‘ప్రపంచ నగరాల సదస్సు’లో పాల్గొనేందుకు ఢిల్లీ సీఎంకు ఆహ్వానం
  • సింగపూర్ వెళ్లేందుకు కేంద్రం సకాలంలో అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ ప్రభుత్వం విమర్శ 
  • పర్యటన ముందే రద్దయిందన్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య మరో వివాదం రాజుకుంది. సింగపూర్ లో ‘ప్రపంచ నగరాల సదస్సు’లో పాల్గొనేందుకు కేజ్రీవాల్ కు నిర్ణీత సమయంలో కేంద్రం నుంచి తగిన అనుమతులు లభించలేదు. దాంతో, ఈ సమావేశంలో పాల్గొని ప్రసగించే అవకాశాన్ని కేజ్రీవాల్ కోల్పోయారు. కేంద్రం కావాలనే అరవింద్ పర్యటనకు అనుమతిని ఆలస్యం చేసిందని ‘ఆప్’ పార్టీ విమర్శించింది. 

ఆగస్టు తొలివారంలో సింగపూర్ వేదికగా జరిగే ‘ప్రపంచ నగరాల సదస్సు’లో పాల్గొనాలని కేజ్రీవాల్ కు ఆహ్వానం అందింది. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక లాంఛనాలు ఈనెల 20వ తేదీలోపే పూర్తి చేయాలి. కానీ, ఇందు కోసం తాము పంపించిన ఫైల్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈనెల 21వ తేదీన తిరిగి ఇచ్చారని ఆప్ పేర్కొంది. ఈ పర్యటనకు లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం నుంచి అసరమైన అనుమతి పొందడంలో ఆసల్యం జరిగిందని, దాంతో, మిగిలిన లాంఛనాలను సకాలంలో పూర్తి చేయలేకపోయామని చెప్పింది. ఈ మేరకు కేంద్రాన్ని నిందిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘సింగపూర్‌లో జరగనున్న వరల్డ్‌ సిటీ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరుకాలేక ఢిల్లీతో పాటు దేశం కూడా అవమానానికి గురికావాల్సి వస్తే దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతికి సంబంధించిన ఫైలు జూన్ 7వ తేదీనే  లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ)కి పంపించాం. 

అయితే, ఎల్‌జీ దాదాపు ఒకటిన్నర నెలల పాటు మౌనంగా ఉండి జులై 21న ఫైల్‌ను తిరిగి ఇచ్చారు. అప్పటికి చాలా జాప్యం జరగడమే కాకుండా, ప్రయాణానికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి జులై 20 వరకు ఉన్న గడువు కూడా ముగిసింది. విద్య, ఆరోగ్యంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి కృషిని ముఖ్యమంత్రి ప్రపంచానికి చెప్పకూడదనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ చర్యలో స్పష్టమవుతోంది’ అని పేర్కొంది. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఆరోపణలను ఖండించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రపంచ నగరాల సదస్సు ఆహ్వానాన్ని సింగపూర్ ఉపసంహరించుకుందని, ఈ మేరకు ఈమెయిల్‌ వచ్చినట్టు కేంద్రం పేర్కొంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని కేజ్రీవాల్ నిర్ణీత గడువు (జులై 20)లోపు అంగీకరించలేకపోయారని, ఫలితంగా ఆహ్వానం రద్దయిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గడువు ముగిసిన మరుసటి రోజు (జూలై 21న) కేజ్రీవాల్ తన పర్యటన ఆమోదం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని కేంద్రం ఆరోపించింది. కేజ్రీవాల్‌ చర్యలన్నీ కేవలం ప్రచారం కోసమేనని కేంద్రం ఆరోపించింది.


More Telugu News