ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు టీకా వేసిన వ్యక్తి అరెస్ట్

  • మధ్యప్రదేశ్ లోని సాగర్ పట్టణంలో వెలుగు చూసిన ఘటన
  • ఓ ప్రైవేటు స్కూల్లో కరోనా నివారణ టీకాల కార్యక్రమం
  • జిల్లా అధికారిపై సస్పెన్షన్ వేటు
అందరికీ ఒక్కటే సిరంజీ వాడకం అన్నది చాలా ఏళ్ల క్రితమే ముగిసిపోయిన విధానం. రెండు దశాబ్దాల కిందట సిరంజీలు, నీడిల్స్ ను బాయిల్ చేసి అందరికీ ఉపయోగించే వారు. హెచ్ ఐవీ వచ్చిన తర్వాత ఆ విధానం సమసిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కసారి, ఒక్కరికి వాడిన అనంతరం పడేసే డిస్పోజబుల్ సిరంజీల వినియోగమే అమల్లో ఉంది. 

అయినా మధ్య ప్రదేశ్ లోని  సాగర్ పట్టణంలో స్కూల్ విద్యార్థులు 39 మందికి ఒకే సిరంజీతో కరోనా టీకాను ఇవ్వడం సంచలనం సృష్టించింది. జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఈ ఘటన బుధవారం జరిగింది. టీకాలు ఇచ్చిన జితేంద్ర అహిర్వార్ పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

అహిర్వార్ ను ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీ విద్యార్థిగా గుర్తించారు. ఆరోగ్య శాఖ తరఫున కరోనా నివారణ టీకాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు జిల్లా వైద్యాధికారి డీకే గోస్వామి తెలిపారు. ఈ ఘటనలో జిల్లా టీకాల కార్యక్రమం అధికారిని సస్పెండ్ చేశారు. 

తనను స్కూల్ వద్ద ఉన్నతాధికారి కారులో దింపేసి వెళ్లాడని, కేంద్రంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కటే సిరంజీ వాడాలని సూచించినట్టు.. ఇందులో తన తప్పు ఏమీ లేదంటూ జితేంద్ర అహిర్వార్ చేసిన ఆరోపణలు సంచలనానికి దారితీశాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నదని డీకే గోస్వామి తెలిపారు.


More Telugu News