చెన్నైలో చెస్ ఒలింపియాడ్ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ... పంచెకట్టుతో అలరించిన వైనం

  • నేటి నుంచి చెస్ ఒలింపియాడ్
  • పోటీపడుతున్న దాదాపు 190 దేశాల క్రీడాకారులు
  • చెన్నై చెస్ కు పుట్టినిల్లుగా వర్ధిల్లుతోందన్న మోదీ
  • ఒలింపియాడ్ బృంద స్ఫూర్తిని చాటే క్రీడోత్సవం అని వెల్లడి
చెన్నైలో ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెస్ కు పుట్టినిల్లుగా చెన్నై వర్ధిల్లుతోందని కొనియాడారు. చెస్ గ్రాండ్ మాస్టర్లకు తమిళనాడు నిలయంగా ఉందని కితాబునిచ్చారు. చెస్ ఒలింపియాడ్ బృంద స్ఫూర్తిని చాటే గొప్ప క్రీడోత్సవం అని మోదీ అభివర్ణించారు. కాగా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని పంచెకట్టులో రావడం విశేషం. భుజంపై కండువాతో తమిళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు.

చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచస్థాయి చదరంగ క్రీడా సంరంభం చెస్ ఒలింపియాడ్ కు భారత్ ఆతిథ్యమివ్వడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యాపై చెస్ సంఘం వేటు వేయడంతో టోర్నీకి ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్ కు దక్కింది. దాదాపు 190 దేశాల క్రీడాకారులు ఈ ఒలింపియాడ్ లో పాల్గొంటున్నారు. చెన్నై ఒలింపియాడ్ లో ఓపెన్, మహిళల విభాగంలో పోటీలు ఉంటాయి. 

ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొనే భారత జట్లకు చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మెంటార్ గా వ్యవహరించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెస్ ఒలింపియాడ్ టార్చ్ ను ఆనంద్... ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ లకు అందించారు.


More Telugu News