అర్పిత ముఖర్జీ ఇంట్లో పట్టుబడిన డబ్బు లెక్కించేందుకు ఎన్ని గంటలు పట్టిందో తెలుసా...?

  • బెంగాల్ లో టీచర్ రిక్రూట్ మెంట్ స్కాం
  • రూ.50 కోట్ల మేర బయటపడిన నగదు
  • రెండో పర్యాయంలో రూ.27.9 కోట్ల నగదు గుర్తింపు
  • లెక్కించేందుకు 8 మంది బ్యాంకు అధికారులు
బెంగాల్ టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఈడీ అధికారులు మరోసారి భారీ మొత్తంలో నగదును గుర్తించిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన మరో ఫ్లాట్ లో రూ.27.9 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, 6 కిలోల బంగారాన్ని కూడా గుర్తించారు. అర్పిత నివాసాల నుంచి ఇంత పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి. శనివారం జరిపిన సోదాల్లో రూ.21.9 కోట్లు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. 

కాగా, తాజాగా గుర్తించిన డబ్బును లెక్కించేందుకు అధికారులకు భారీగా సమయం పట్టింది. రూ.27.9 కోట్ల నగదును లెక్కించేందుకు 8 మంది బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. వారు 13 గంటల పాటు శ్రమించి, పెద్ద గుట్టలా పడివున్న ఆ నోట్లను లెక్కించి ఓ క్రమపద్ధతిలో పేర్చారు. ఆ డబ్బును లెక్కించేందుకు 4 క్యాష్ కౌంటింగ్ యంత్రాలను కూడా ఉపయోగించారు. 

ఈ టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంకు సంబంధించి పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ ఇద్దరూ కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. గతంలో పార్థ ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరిస్తోంది. ప్రస్తుతం వాణిజ్య, ఐటీ మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీ తీవ్ర కుంభకోణంలో చిక్కుకోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయనపై వేటు వేశారు.


More Telugu News