జూనియర్ లైన్ మెన్, అసిస్టెంట్ ఇంజినీర్ల రాత పరీక్షలో భారీ అవకతవకలు జరిగాయి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • ఇటీవల తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగాలకు పరీక్షలు
  • అక్రమాలు జరిగాయంటున్న ప్రవీణ్ కుమార్
  • పరీక్షలు రద్దు చేయాలని స్పష్టీకరణ
  • విద్యుత్ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ విద్యుత్ శాఖ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఎలుగెత్తారు. తెలంగాణ సదరన్ పవర్ కంపెనీ (టీఎస్ పీడీసీఎల్-ట్రాన్స్ కో) ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ లైన్ మెన్ రాతపరీక్షకు వేలాది మంది తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు హాజరయ్యారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  

అయితే, ఈ పరీక్షలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్ట వెల్లడైందని, ఇప్పటికే దీనిపై రాచకొండ పోలీసులు ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోందని వివరించారు. తన వద్ద ఉన్న ఆధారాలను రాచకొండ పోలీసులకు అందజేశానని వెల్లడించారు. 

అటు, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఒకే అభ్యర్థికి నాలుగు హాల్ టికెట్లు జారీ అయ్యాయని తెలిపారు. ఒకటే ఫొటో, ఒకటే పుట్టిన తేదీ, ఒకటే తండ్రి పేరు ఉంటుందని, కానీ సర్ నేమ్ మాత్రం మారుతూ ఉంటుందని వివరించారు. ఈ విషయాన్ని తాను 15వ తేదీనే, పరీక్షకు రెండ్రోజుల ముందే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ రఘుమారెడ్డి దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. అయినా గానీ పరీక్షను యథెచ్ఛగా జరిపారని ఆరోపించారు. 

ఈ రెండు పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. అందుకే జూనియర్ లైన్ మెన్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల పరీక్షలను రద్దు చేసి వేలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్ ను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. మళ్లీ తాజాగా పరీక్షలు జరపాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యుత్ శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్ కో కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని స్పష్టం చేశారు.


More Telugu News