ఆరేళ్లు నిండకపోతే మరోమారు యూకేజీ చదవాల్సిందే.. కర్ణాటకలో నిబంధన

  • ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలోకి ప్రవేశం
  • ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
  • ఇప్పటి వరకు ఐదేళ్ల ఐదు నెలలే అర్హత
  • కొత్త నిబంధనపై విమర్శలు
కర్ణాటకలో విద్యకు సంబంధించి తీసుకొచ్చిన కొత్త నిబంధన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యూకేజీ చదువుతున్న వారు 2023 జూన్ నాటికి ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశానికి అర్హత లభిస్తుందని అక్కడి విద్యా శాఖ స్పష్టం చేసింది. ఆరేళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుందని పేర్కొంది. ఇప్పటి వరకు ఒకటో తరగతి చదివేందుకు ఐదేళ్ల ఐదు నెలలు ఉంటే సరిపోయేది. 

కొత్త నిబంధన అటు తల్లిదండ్రులనే కాదు, టీచర్లు, పాఠశాలలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రీ స్కూల్స్ అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. ‘‘మా బాబు జులైలో జన్మించాడు. ఇప్పుడు అతడ్ని ఒకటో తరగతిలోకి అనుమతిస్తారా? లేదంటే మరోసారి అదే తరగతి చదవమంటారా?’’ అని ఓ తండ్రి బాధను వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఒక ఏడాది విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఈ నిర్ణయాన్ని సమర్థించే వారూ ఉన్నారు. ‘‘చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంకా మానసికంగా, భావోద్వేగ పరంగా సన్నద్ధం కాకముందే గ్రేడ్ 1లో చేర్చాలని చూస్తుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వారిపై ఒత్తిడిని తగ్గిస్తుంది’’ అని 50వేల మంది సభ్యులతో ఫేస్ బుక్ గ్రూపు నడుపుతున్న స్వేతా శరణ్ పేర్కొన్నారు.


More Telugu News