పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం.. రోడ్డుపై గుంతలో పడిన బైక్.. యువకుడి మృతి

  • దక్షిణాఫ్రికాలో టెక్నీషియన్ గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్
  • మరో వారం రోజుల్లో సౌతాఫ్రికాకు వెళ్లాల్సిన ప్రవీణ్
  • నిన్న రాత్రి అత్తిలి నుంచి తాడేపల్లిగూడెం వెళ్తుండగా ప్రమాదం
రోడ్డు మీద ఉన్న ఒక గొయ్యి ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్న దుర్ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ముద్దునూరులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రావిగుంట వద్ద నిన్న రాత్రి ప్రవీణ్ కుమార్ (29) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే అత్తిలికి చెందిన ప్రవీణ్ కుమార్ దక్షిణాఫ్రికాలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సౌతాఫ్రికా నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మరో వారంలో రోజుల్లో ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. 

నిన్న రాత్రి ఒక పని మీద అత్తిలి నుంచి తాడేపల్లిగూడెంకు బైక్ మీద ప్రవీణ్ బయల్దేరాడు. అయితే రావిగుంట వద్ద రోడ్డుపై గోతులు కనిపించక వేగంగా అలాగే ముందుకు వెళ్లాడు. బైక్ గొయ్యిలోకి వెళ్లి అదుపుతప్పింది. ఈ ఘటనలో ఆయన బైక్ పై నుంచి ఎగిరి పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో... ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.  

మరోవైపు పెంటపాడు నుంచి పిప్పర వరకు ఉన్న ఈ రోడ్డును గత ఏడాదే ఆర్ అండ్ బీ అధికారులు నాలుగు లేన్ల రహదారిగా మార్చారు. రోడ్డుపై పడిన గోతులను మూడు నెలల క్రితమే పూడ్చారు. అయితే, భారీ వర్షాల కారణంగా రోడ్డుపై మళ్లీ గోతులు పడ్డాయి. భారీ వాహనాల రాకపోకల వల్ల కూడా రోడ్డు పాడయింది.


More Telugu News