మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

  • వర్షం కారణంగా రెండు గంటలకు పైగా నిలిచిపోయిన ఆట
  • డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విండీస్‌కు లక్ష్యం నిర్దేశం
  • 119 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం
  • రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయిన గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
  • రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలోనూ విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా రెండు గంటలకుపైగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 119 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 36 ఓవర్లలో 225 పరుగులు చేయగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్ధారించారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ 26 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 119 పరుగుల తేడాతో ధావన్ సేన ఘన విజయం సాధించింది. అంతేకాదు, విండీస్ గడ్డపై మూడు, అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలిసారి క్లీన్‌స్వీప్ చేసింది.

257 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు మరోమారు కంగారు పెట్టించారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో బ్రెండన్ కింగ్, కెప్టెన్ నికోలస్ పూరన్ చెరో 42 పరుగులు చేయగా, ఓపెనర్ షాయ్ హోప్ 22 పరుగులు చేశాడు. జట్టులో నలుగురు డకౌట్ కాగా, ముగ్గురు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. ఫలితంగా 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలిన విండీస్ భారీ తేడాతో ఓటమి పాలైంది. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 113 పరుగులు జోడించారు. 74 బంతుల్లో 7 ఫోర్లతో 58 పరుగులు చేసిన ధావన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా క్రీజులో కుదురుకున్నాడు. గిల్‌తో కలిసి చక్కని సమన్వయంతో ఆడాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేసిన అయ్యర్ అకీల్ హొసీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8) కూడా పెవిలియన్ చేరాడు. 

మరోవైపు, గిల్ 98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. విండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్‌ రెండు వికెట్లు తీసుకోగా, అకీల్‌కు ఒక వికెట్ దక్కింది. త్రుటిలో శతకం కోల్పోయిన గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్-విండీస్ మధ్య రేపటి నుంచి 5 వన్డేల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.


More Telugu News