మంకీ పాక్స్ సోకితే ఏం చేయాలి.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవిగో
- కనీసం 21 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని సూచించిన కేంద్రం
- మూడు లేయర్లు ఉండే మాస్కులు ధరించాలని.. రోగులకు దూరంగా ఉండాలని వెల్లడి
- చర్మంపై ఏర్పడే దద్దుర్లను పూర్తిగా కప్పేసేలా వస్త్రాలు ధరించాలని సూచన
దేశంలో మంకీ పాక్స్ కేసులు మెల్లగా పెరుగుతుండటం, రోజు రోజుకు అనుమానిత కేసుల విషయంపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మంకీ పాక్స్ వైరస్ ఎలా సోకుతుంది, సోకినవారు, వారితో కలిసి ఉన్నవారు ఏమేం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై స్పష్టమైన సూచనలు చేసింది.
కేంద్రం చేసిన సూచనలు ఇవీ..
కేంద్రం చేసిన సూచనలు ఇవీ..
- మంకీ పాక్స్ సోకినవారితోపాటు వారితో సన్నిహితంగా ఉన్నవారు కూడా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. సన్నిహితంగా మెలగకున్నా.. వైరస్ సోకినవారితో కొంత సమయం పాటు కలిసి మాట్లాడినవారు, కలిసి భోజనం చేసినవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
- మంకీ పాక్స్ సోకినవారు కచ్చితంగా 21 రోజుల పాటుగానీ, వారి శరీరంపై అయిన దద్దుర్లు/పుండ్లు పూర్తిగా తగ్గిపోయే వరకు గానీ ఐసోలేషన్ లో ఉండాలి.
- వైరస్ సోకినవారు తమ శరీర భాగాలపై వచ్చిన దద్దుర్లు/పుండ్లను పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. అయితే అవి కాస్త వదులుగా ఉండి, పుండ్లు మానిపోయేందుకు వీలయ్యేలా ఉండాలి.
- వైరస్ సోకినవారు, వారితో సన్నిహితంగా ఉండేవారు మూడు పొరలు ఉండే నాణ్యమైన మాస్కులు ధరించాలి.
- మంకీ పాక్స్ సోకినవారుగానీ, సన్నిహితంగా మెలిగిన వారుగానీ కొంతకాలం పాటు రక్తం, ఇతర శరీర ద్రవాల దానం వంటివి దానం చేయకూడదు.
- ఈ వైరస్ సోకినవారికి జ్వరం, పుండ్లతోపాటు తలనొప్పి, గొంతు గరగర, దగ్గు, వాపు వంటివి ఉంటాయి. వాటికి వైద్యుల సలహా మేరకు తగిన మందులను వాడాలి.
- మంకీ పాక్స్ సోకిన వారికి చికిత్స అందించిన, సేవలు చేసిన వైద్య సిబ్బంది కూడా 21 రోజుల పాటు ప్రత్యేక పరిశీలనలో ఉండాలి. వారిలో ఎలాంటి లక్షణాలు లేకుంటే.. తగిన జాగ్రత్తలతో విధులు నిర్వర్తించవచ్చు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ లోకి వెళ్లి.. పరీక్షలు చేయించుకోవాలి.
- ‘మంకీ పాక్స్ వైరస్ విషయంపై అతిగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది ప్రాణాపాయం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని రోజుల్లోనే కోలుకుని రోజువారీ జీవితం గడపవచ్చు..’ అని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.