‘డెత్ సర్టిఫికెట్.. మీదా, వేరే వాళ్లదా?’.. అమెరికాలోని ఓ కౌంటీ వెబ్ సైట్ స్క్రీన్ షాట్ తో ఆనంద్ మహీంద్రా ట్వీట్!

  • అమెరికాలోని నార్త్ కరొలినా రాష్ట్రం మెకెలెన్ బర్గ్ కౌంటీ వెబ్ సైట్లో చిత్రమైన ఆప్షన్లు
  • చనిపోయినవారే సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటున్నారనే అర్థం వచ్చేలా ఉండటంతో వైరల్
  • ముందు జాగ్రత్తగా ముందే సర్టిఫికెట్ ఇస్తున్నారా అంటూ కామెంట్లు
సాధారణంగా ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలి. నిర్ణీత గడువు తర్వాత సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఆధునిక టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతున్నకొద్దీ ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరైనా చనిపోయిన వారికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ ను కూడా అలాగే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానీ అమెరికాలోని నార్త్ కరొలినా రాష్ట్రం మెకెలెన్ బర్గ్ కౌంటీలో మాత్రం మరో ‘అదనపు’ సౌకర్యం కూడా ఉందంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

డెత్ సర్టిఫికెట్ మీదేనా?
ఎందుకంటే ఆ వెబ్ సైట్లో డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు అడిగే వివరాలు చిత్రంగా ఉండటం విశేషం. అందులో దరఖాస్తు చేసుకునేవారికి.. ‘డెత్ సర్టిఫికెట్ ఎవరిది?’ అనే ప్రశ్నతోపాటు ‘మీదేనా, వేరే వాళ్లదా?’ అనే రెండు సమాధానపు ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆప్షన్లలో ఒక దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్లు వచ్చి తమ డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆనంద్ మహీంద్రా ఈ వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ను పెట్టి.. ‘మరణానంతరం కూడా జీవితం ఉంటుందనే సంస్కృతి మనదొక్కటే కాదు.. చాలా చోట్ల ఉందన్నమాట..’ అంటూ సరదాగా కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

‘ఆ ప్రాంతంలో ముందస్తుగానే డెత్ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నారా?’ అంటూ కొందరు.. ‘మరో ప్రపంచంలోకి వెళ్లడానికి ఆత్మలకు ఈ డెత్ సర్టిఫికెట్స్ అవసరమేమో’ అని మరికొందరు.. ‘ఇదేదో బాగుందే..’ అంటూ ఇంకొందరు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు.



More Telugu News