కన్వారియాలకు పూలు.. మాకు బుల్డోజర్లా?.. యోగి సర్కారు తీరుపై అసదుద్దీన్​ ఫైర్​

  • తనవి విభజన రాజకీయాలు కాదన్న అసదుద్దీన్ 
  • తమ ఇళ్లు కూలగొట్టకుండా ఉండాలన్న ఎంఐఎం చీఫ్   
  • ముస్లింలపై వివక్ష వద్దని.. కనీస దయ చూపించాలని విజ్ఞప్తి
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మతపరంగా వివక్షను పాటిస్తోందని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. యూపీలో కన్వారియాలు (ఆధ్యాత్మిక పాదయాత్ర చేసే హిందువులు) వెళ్తుంటే.. వారికి పై నుంచి పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానం పలుకుతుంటారని.. అదే ముస్లింల ఇళ్లు కూలగొడుతుంటారని మండిపడ్డారు. పార్లమెంటు భవనం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీలోని మీరట్ జిల్లా కలెక్టర్, పోలీస్ చీఫ్ ఇటీవల కన్వారియాలపై పూలు చల్లించడాన్ని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. 

మాపై కాస్త దయ చూపండి
“ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో కన్వారియాలపై హెలికాప్టర్ తో పూలు చల్లుతారు. సరే మరి మా మీద కూడా కాస్త దయ చూపించండి అని కోరుతున్నాం. మమ్మల్ని కూడా సమానంగా చూడండి. మీరు వారిపై పూలు చల్లుతున్నప్పుడు.. కనీసం మా ఇళ్లను కూలగొట్టకుండా ఉండండి..” అని అసదుద్దీన్ పేర్కొన్నారు.

నా రాజకీయం సమానత్వం కోసం..
యూపీలోని హాపూర్ లో ఓ కన్వరియా పాదాలకు నొప్పి నివారణ మందును పోలీసు ఇన్ స్పెక్టర్ రాయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘మీరు వారి కాళ్లకు మసాజ్ చేస్తారు. కానీ షహరన్ పూర్ లో ముస్లిం యువతను తీసుకెళ్లి కొడతారు. ఇదేం వివక్ష? పైనా నేను విభజన రాజకీయాలు చేస్తున్నానని ఆరోపణలు చేస్తారు. కానీ నాది సమానత్వ రాజకీయం. అందరినీ సమానంగా చూడాలనే నేను కోరుతున్నా.. ఒక మతం వారి కోసం ట్రాఫిక్ ను మళ్లిస్తారు. మరో మతం వారిపై బుల్డోజర్లు నడిపిస్తారా?” అని అసదుద్దీన్ ప్రశ్నించారు. 



More Telugu News