బీఎస్ఎన్ఎల్‌కు రూ.1.64 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీని ప్ర‌క‌టించిన కేంద్రం

  • ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్
  • బీఎస్ఎన్ఎల్‌లో బీబీఎన్ఎల్ విలీనానికి ఆమోదం
  • మారుమూల గ్రామాల్లో 4జీ నెట్‌వ‌ర్క్ విస్త‌ర‌ణ‌కు చ‌ర్య‌లు
భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌) పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బుధ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నిర్వ‌హ‌ణా లోపాల‌తో నానాటికీ బ‌క్కచిక్కిపోతున్న బీఎస్ఎన్ఎల్‌ను తిరిగి ప్ర‌గ‌తి బాట ప‌ట్టించేందుకు ఏకంగా రూ.1.64 ల‌క్ష‌ల కోట్ల‌ను కేటాయిస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్‌లో భార‌త్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వ‌ర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్‌)ను విలీనం చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ రెండు సంస్థ‌ల విలీనం త‌ర్వాత దేశంలోని మారుమూల గ్రామాల‌కు కూడా 4జీ నెట్‌వ‌ర్క్ స‌దుపాయాన్ని క‌ల్పించే దిశ‌గా బీఎస్ఎన్ఎల్ చ‌ర్య‌లు చేప‌ట్ట‌నుంది. అందుకోసం తాజాగా ప్ర‌క‌టించిన భారీ ప్యాకేజీలోని మెజారిటీ నిధుల‌ను వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.


More Telugu News