ఆ ప్రదేశాలలో చిన్న గాయం కూడా మంకీ పాక్స్ కి సంకేతం కావచ్చు: యూకే హెల్త్ ఏజెన్సీ

  • జననాంగం, మలద్వారం, ముఖంపై గాయం కనిపిస్తే అనుమానించాల్సిందే
  • కొత్త వ్యక్తితో సాన్నిహిత్యం, శృంగారం తర్వాత కనిపిస్తే వ్యాధి సంకేతాలే
  • వ్యాధి లక్షణాలను సవరించిన యూకే హెల్త్ ఏజెన్సీ
చిన్న గాయం కూడా మంకీపాక్స్ వైరస్ కు సంకేతం కావొచ్చని బ్రిటన్ కు చెందిన హెల్త్ ఏజెన్సీ హెచ్చరించింది. అది కూడా ఓ వ్యక్తి కొత్తగా ఎవరితో అయినా శృంగారంలో పాల్గొన్న తర్వాత చిన్న గాయం కనిపిస్తే మంకీపాక్స్ గా అనుమానించాల్సి ఉంటుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. మంకీపాక్స్ వైరస్ ఇప్పటికే 75 దేశాలకు వ్యాపించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఆరోగ్య స్థితిగా ప్రకటించడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మంకీపాక్స్ వైరస్ కేసులకు సంబంధించి యూకే హెల్త్ ఏజెన్సీ నిర్వచనాన్ని అప్ డేట్ చేసింది. దీనివల్ల వ్యక్తులు, వైద్య నిపుణులు వైరస్ ను గుర్తించడం సులభంగా ఉంటుందని పేర్కొంది. వ్యాధి లక్షణాల జాబితాను పెంచింది. ఇందులో జననాంగాలు, మల విసర్జన ద్వారం, దాని చుట్టుపక్కల, ముఖం, పెదవులపై చిన్న గాయం కనిపించినా అది మంకీపాక్స్ వైరస్ కావొచ్చని పేర్కొంది. 

సన్నిహితంగా మెలగడం, శృంగారంలో పాల్గొనడం ద్వారా మంకీపాక్స్ వైరస్ వ్యాపిస్తున్నట్టు ప్రాథమిక పరీక్షల ఆధారంగా తెలుస్తున్నట్టు యూకే హెల్త్ ఏజెన్సీ తెలిపింది. అధిక జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, లింఫ్ నోడ్స్ వాపు ఇన్ఫెక్షన్ కు సంకేతాలుగా పేర్కొంది.


More Telugu News