చేతి గ్రిప్ బలహీనంగా ఉంటే.. అనారోగ్యానికి సంకేతమే!.. తాజా అధ్యయనంలో వెల్లడి!
- తాజా అధ్యయనంలో హ్యాండ్ గ్రిప్ పై దృష్టి పెట్టిన పరిశోధకులు
- అనారోగ్యం, అంతర్గత సమస్యలకు సంకేతమని వెల్లడి
- దీని ఆధారంగా మరిన్ని పరీక్షలకు సిఫారసు చేయవచ్చని సూచన
ఒక వ్యక్తి ఆరోగ్యం ఎంత దృఢంగా ఉందో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు సాయపడతాయి. అయితే, వైద్య పరీక్ష చేయించడానికి ముందే ఒకరి ఆరోగ్యం తెలుసుకునేందుకు వారి చేతి పట్టుని పరిశీలిస్తే చాలు. హ్యాండ్ గ్రిప్ (చేతి పట్టు) బలం, వారి ఆరోగ్య స్థితిని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే నిర్వహించిన ఈ పరిశోధన ఫలితాలు బీఎంజే ఓపెన్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
కొందరు పచ్చళ్ల సీసా మూతను కూడా తీయలేరు. సరుకులు నిండా ఉన్న సంచిని మోయలేరు. ఇది దేనికి సంకేతం..? హ్యాండ్ గ్రిప్ తక్కువగా ఉంటే అది అంతర్గతంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు నిదర్శమని తాజా అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. పెద్దవారే కాకుండా, పిల్లల్లోనూ చేతి పట్టు ఆరోగ్య స్థితిని తెలియజేస్తుందని అంటున్నారు.
గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని హ్యాండ్ గ్రిప్ ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు. హ్యాండ్ గ్రిప్ తక్కువగా ఉన్న వారి ఆయుర్థాయం కూడా తక్కువగా ఉంటుందని గతంలో కొన్ని అధ్యయనాలు గుర్తించాయి. కనుక హ్యాండ్ గ్రిప్ తక్కువగా ఉన్న వారిని తదుపరి వైద్య పరీక్షల కోసం పంపించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
‘‘సాధారణంగా అయితే హ్యాండ్ గ్రిప్ బలం ఒక వ్యక్తి వయసు, ఎత్తుపై ఆధారపడి ఉంటాయి. హ్యాండ్ గ్రిప్ ఏ స్థాయికి తక్కువగా ఉన్న రోగులను తదుపరి పరీక్షల కోసం ప్రాక్టీషనర్లు పంపించాలో? తెలుసుకోవడమే మా అధ్యయనం ఉద్దేశ్యం. రక్తపోటు మాదిరే హ్యాండ్ గ్రిప్ బలానికి కూడా పరిమితులు నిర్దేశించడం దీని అర్థం. రక్తపోటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే వైద్యులు మందులు సూచించడం, లేదంటే తదుపరి పరీక్షల కోసం సిఫారసు చేస్తుంటారు’’ అని పరిశోధకులు సెర్గీ షెర్బోవ్ తెలిపారు.
‘‘హ్యాండ్ గ్రిప్ పరీక్ష సులభమైనది, చౌక అయినది. ఆరోగ్య సమస్యలను, అంతర్గతంగా ఉన్న అనారోగ్యాలను ముందుగానే గుర్తించడానికి ఇది సాయపడుతుంది. అందుకనే మెడికల్ ప్రాక్టీస్ లో రోగుల ఆరోగ్యాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి దీన్నొక టూల్ గా తీసుకోవాలన్నది మా సూచన’’ అని పరిశోధనలో పాల్గొన్న స్టీబర్ తెలిపారు.