ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాలా..? వేచి చూడాలా..?

  • ఈ నెల 31తో ముగియనున్న గడువు
  • పొడిగించాలంటూ వస్తున్న వినతులు
  • పొడిగింపు ఉండదన్న కేంద్ర సర్కారు
  • ఇప్పటికి సగం మేరే దాఖలైన రిటర్నులు
  • సకాలంలో దాఖలు చేయడమే మంచిది
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం వివరాలతో పన్నులు రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. కరోనా మహమ్మారి ప్రవేశం కారణంగా 2020, 2021లో డిసెంబర్ వరకు గడువు పొడిగించారు. దీనివల్ల సాధారణ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అలా చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో రిటర్నులు కూడా దాఖలయ్యాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది.

ఐటీ రిటర్నుల దాఖలుకు మరో ఐదు రోజులే గడువు ఉంది. అయినా, సగం మంది కూడా రిటర్నులు వేయలేదు. జులై 20 నాటికి 2.3 కోట్ల రిటర్నులే వచ్చాయి. గతేడాది 5.89 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. అంటే ఇంకా సగం మంది దాఖలు చేయాల్సి ఉంది. గత రెండు సంవత్సరాల మాదిరే ఈ ఏడాది పన్ను రిటర్నుల గడువు పొడిగింపు ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. అందుకే రిటర్నులు తక్కువగా వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. 

ఇప్పటి వరకు గడువు పొడిగిస్తారని చూసిన వారు, ఇప్పుడు తేరుకుని రిటర్నులు దాఖలు చేస్తున్నారు. దీంతో రద్దీ కూడా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. నిజానికి ఏటా జులై 31 వరకు రిటర్నుల దాఖలుకు గడువు ఇస్తారు. పొడిగింపు అన్నది అరుదుగా ఉంటుంది. గతేడాది ఆదాయపన్ను శాఖ కొత్త ఈఫైలింగ్ పోర్టల్ ను ప్రారంభించింది. అందులో సాంకేతిక సమస్యలు రావడంతో గడువును పొడిగించారు. ఈ విడత పెంపు ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మరి చివరి రోజున గడువు పెంపుపై నిర్ణయం వెలువడుతుందేమో చూడాలి.

మరోపక్క, ఒక నెల వరకు గడువు పొడిగించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. నిపుణులు కూడా గడువు పొడిగింపునే సూచిస్తున్నారు. అయితే, గడువు పొడిగింపు ఉంటుందని రిటర్నులు దాఖలను వాయిదా వేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. గడువు పొడిగింపు లేకపోతే, రిటర్నులు దాఖలు చేయని వారు జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

2021-22 ఆర్ధిక సంవత్సరానికి రిటర్నులను 2022 డిసెంబర్ వరకు దాఖలు చేయవచ్చు. కాకపోతే జులై 31 తర్వాత దాఖలు చేస్తే రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉంటే రూ.1,000 చెల్లించాలి. దీనికి వడ్డీ కూడా చెల్లించాలి. ఒకవేళ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉండి, రిటర్నులు దాఖలు చేయకపోతే.. అప్పుడు చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా పడుతుంది. రిఫండ్ కూడా ఆలస్యం కావచ్చు.


More Telugu News