సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటాం: రష్యా
- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాల ఆగ్రహం
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తప్పుకుంటున్నామన్న రష్యా
- అంతరిక్ష పరిశోధనలకు మాత్రం దూరం కాబోమని వ్యాఖ్య
ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆ దేశాలు ఎన్నో ఆంక్షలను విధించాయి. ఈ నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తప్పుకోనున్నట్టు తెలిపింది. అయితే, అంతరిక్ష పరిశోధనలకు మాత్రం దూరం కాబోమని చెప్పింది. ఈ విషయాన్ని రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మాస్ డీజీగా నియమితులైన యూరి బోరిసోవ్ తెలిపారు. కొత్తగా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్టు రష్యా తెలిపింది. అయితే, స్పేస్ స్టేషన్ విషయంలో తమ భాగస్వాములకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.