చంద్ర‌బాబుతో మోహ‌న్ బాబు భేటీ... సుదీర్ఘంగా కొన‌సాగిన మంత‌నాలు

  • టీడీపీతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మోహ‌న్ బాబు
  • పార్టీ త‌ర‌ఫున‌నే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగిన న‌టుడు
  • ఆపై టీడీపీకి దూరంగా జ‌రిగి వైసీపీలో చేరిన వైనం
  • ఇటీవ‌లే వైసీపీకి కూడా రాజీనామా చేసిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • చంద్ర‌బాబు, మోహ‌న్ బాబుల భేటీపై ఏపీలో అమితాస‌క్తి
ఏపీ రాజ‌కీయాల్లో మంగ‌ళ‌వారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుతో ప్ర‌ముఖ సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసంలో జ‌రిగిన ఈ భేటీ సుదీర్ఘంగా సాగింది. భేటీలో భాగంగా ఏపీ తాజా రాజ‌కీయాల‌పై ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. 

సినీ న‌టుడిగా కొన‌సాగుతూనే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహ‌న్ బాబు టీడీపీతోనే త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన మోహ‌న్ బాబు టీడీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ కొన‌సాగారు. ఆ త‌ర్వాత పార్టీ కార్య‌క్ర‌మాల నుంచి దూరంగా జ‌రిగిన మోహ‌న్ బాబు... చంద్ర‌బాబుకు దాదాపుగా వైరివ‌ర్గంగా మారిపోయారు. 

2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన మోహ‌న్ బాబు... ఎన్నిక‌ల్లో పార్టీ నుంచి ఎలాంటి అవ‌కాశం ద‌క్కకున్నా పార్టీలోనే కొన‌సాగారు. ఈ క్ర‌మంలో వైసీపీతోనూ దూరం పెంచుకున్న మోహ‌న్ బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నాన‌ని, ఇక‌పై రాజ‌కీయాల జోలికి వెళ్ల‌నంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. అంతేకాకుండా ఇటీవ‌లే తాను బీజేపీ సిద్ధాంతాల‌ను అవ‌లంబించే వ్య‌క్తిగా త‌న‌ను తాను ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. తాజాగా చంద్ర‌బాబుతో మోహ‌న్ బాబు భేటీ కావ‌డం ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తోంది.


More Telugu News