మంకీ పాక్స్ కు వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాల్లో ఉన్నాం.. సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా

  • మంకీ పాక్స్ వైరస్ కొత్తదేమీ కాదు.. దశాబ్దాలుగా వ్యాప్తిలో ఉందన్న పూనావాలా
  • దానికి వ్యాక్సిన్ రూపొందించేందుకు నోవావాక్స్ సంస్థతో చర్చిస్తున్నట్టు వెల్లడి
  • ఈ వ్యాక్సిన్ కోసం ప్రత్యేక సదుపాయాలు అవసరమని వివరణ
ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండటం, ఇటీవల భారత దేశంలోనూ కేసులు నమోదవుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో మంకీ పాక్స్ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అధినేత అదర్ పునావాలా ప్రకటించారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి  మన దేశంలో భారీ ఎత్తున ఇచ్చిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ ను సీరం ఇనిస్టిట్యూట్ సంస్థనే ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంకీ పాక్స్ వైరస్ విస్తృతి నేపథ్యంలోనూ.. అందరి కళ్లూ ఎస్ఐఐ వైపే మళ్లాయి. ఈ క్రమంలో పూనావాలా చెప్పిన అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.

నోవావాక్స్ తో చర్చలు జరుపుతున్నాం
మంకీ పాక్స్ వైరస్ దాదాపు దశాబ్ద కాలం నుంచీ ఉందని అదర్ పూనావాలా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వైరస్ విస్తరణ పెరిగిందని తెలిపారు. మంకీ పాక్స్ కు అత్యంత ఆధునిక విధానమైన మెస్సెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు ప్రఖ్యాత నోవావాక్స్ ఫార్మా సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే కనీసం ఏడాదికిపైగా సమయం అవసరమని వెల్లడించారు.

వ్యాక్సిన్ అవసరం ఉందా అన్నది తేల్చాల్సి ఉంది..
‘‘ఒక వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా సాంకేతిక సామర్థ్యం, అవగాహన ఉన్న సంస్థగా.. వ్యాక్సిన్ల ఉత్పత్తిపై భాగస్వాములతో మాట్లాడుతున్నాం. ఈ క్రమంలోనే నోవావాక్స్ తో మాట్లాడుతున్నాం. వాస్తవంగా మంకీ పాక్స్ వ్యాక్సిన్ అవసరం ఉందా? లేకుంటే మూడు, నాలుగు నెలల్లో ఇది ముగిసిపోతుందా అన్నది పరిశీలించాల్సి ఉంది..” అని అదర్ పూనావాలా పేర్కొన్నారు. మంకీ పాక్స్ వైరస్ పెద్ద మిస్టరీ ఏమీ కాదని.. చాలా దశాబ్దాలుగా వ్యాప్తిలో ఉన్నదేనని చెప్పారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థల్లో వచ్చిన అభివృద్ధి, సరికొత్త పరికరాల వల్ల కేసులను గుర్తించగలుగుతున్నామని తెలిపారు.

ప్రత్యేక సదుపాయాలు అవసరం కావడం వల్లే..
కోవిడ్ తో పోలిస్తే మంకీ పాక్స్ భిన్నమైనదని.. దీనికి వ్యాక్సిన్ తయారీ కోసం ప్రత్యేకమైన కంటైన్ మెంట్ సదుపాయాలు అవసరమని అదర్ పూనావాలా చెప్పారు. ఇప్పటికిప్పుడు ఇండియాలో ఆ సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని.. అందువల్ల విదేశీ భాగస్వాములతో మాట్లాడుతున్నామని వివరించారు. తాము కచ్చితంగా మంకీ పాక్స్ కు వ్యాక్సిన్ తయారు చేయగలమని స్పష్టం చేశారు.



More Telugu News