త్వరలో ఫేస్ బుక్ లో ఐదు ప్రొఫైల్స్.. ఎవరెవరికి ఏమేం కనబడాలో అవే కనిపించేలా చేసుకోవచ్చు!

  • ప్రతి ప్రొఫైల్ కు నచ్చినట్టుగా వేర్వేరు పేర్లు పెట్టుకునే అవకాశం
  • ఫ్రెండ్స్ ను నచ్చిన ప్రొఫైల్ కు యాడ్ చేసుకోవచ్చు..
  • ఫొటోలు, వీడియోలు, పోస్టులే వారికి కనబడేలా ఆప్షన్
  • ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఈ సదుపాయం ఉందంటున్న ఫేస్ బుక్ ప్రతినిధులు
ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్ ఖాతా ఉంటోంది. కుటుంబ సభ్యుల నుంచి స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు, కలిసి పనిచేసేవారితోపాటు అసలు ముక్కూమొహం తెలియని వారూ ‘ఫ్రెండ్స్’ లిస్టులో ఉంటున్నారు. ఏవైనా ఫొటోలు, వీడియోలు పెడదామని ఉంటుంది. కామెంట్లో, మనకు నచ్చిన ముచ్చట్లో పోస్టు చేయాలని అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ లిస్టులో అందరికీ అవి కనిపిస్తాయి. అలాగని పోస్టులు పెట్టకుండా ఉండలేరు. చేస్తే మొత్తంగా బ్లాక్ చేయాలి, లేదంటే అన్ ఫ్రెండ్ చేయాలి. అదేదో కావాల్సిన వారికి కావాల్సిన పోస్టులే కనిపించేలా చేసుకునే వెసులుబాటు ఉంటే.. భలే బాగుంటుంది కదా. ఫేస్ బుక్ సంస్థ త్వరలోనే ఇలాంటి ఆప్షన్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఐదు వరకు ప్రొఫైల్స్..
ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఒకే ప్రొఫైల్ కు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి కేవలం పరిచయస్తుల దాకా ‘ఫ్రెండ్’ అయిన వారందరికీ అదే కనిపిస్తుంది. లేదంటే ఎక్కువ సంఖ్యలో ఫేస్ బుక్ ఖాతాలను ఏర్పాటు చేసుకుని, వేర్వేరుగా స్నేహితులను మెయింటైన్ చేస్తున్నవారూ ఉన్నారు. అలా కాకుండా ఒకే అకౌంట్ లో ఐదు వరకు ప్రొఫైల్స్ ను ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ఫేస్ బుక్ ఏర్పాట్లు చేస్తోంది.

‘‘వినియోగదారులకు ఒకే ఫేస్ బుక్ ఖాతాలో వారి అవసరాలకు తగినట్టుగా వేర్వేరు ప్రొఫైల్స్ ను ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని తీసుకురానున్నాం. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది.. ” అని ఫేస్ బుక్ యాజమాన్య సంస్థ ‘మెటా’ ప్రతినిధి వెల్లడించారు. 

అదే ఖాతాలో.. ప్రొఫైల్స్ మార్చుకునేలా..
  • ఫేస్ బుక్ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. వినియోగదారులు ఒకే ఖాతాలో ఐదు వరకు వేర్వేరు ప్రొఫైల్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. 
  • అందులో అకౌంట్ కు అనుసంధానంగా ఉండే ప్రధాన ప్రొఫైల్ ఒకటి, నాలుగు అదనపు ప్రొఫైల్స్ ఉంటాయి. అదనపు ప్రొఫైల్స్ కు వినియోగదారులు తమకు నచ్చిన పేర్లను పెట్టుకోవచ్చు.
  • అకౌంట్ కు లింక్ అయి ఉండే ప్రధాన ప్రొఫైల్ లో ఇప్పుడున్నట్టుగానే యూజర్ కు సంబంధించిన అసలైన వివరాలను యాడ్ చేసుకోవచ్చు. అదనపు ప్రొఫైల్స్ లో ఈ వివరాలేమీ కనబడవు, సదరు వినియోగదారుడి అసలైన సమాచారమేదీ అదనపు ప్రొఫైల్స్ కు యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
  • కేవలం రెండు ఆప్షన్లను మార్చుకోవడం ద్వారా ఫేస్ బుక్  ప్రొఫైల్స్ మధ్య విహరించవచ్చు. 
  • అదనపు ప్రొఫైల్స్ అయినా సరే.. ఇష్టం వచ్చినట్టుగా నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లతో పేర్లు పెట్టుకోవడం కుదరదని, అన్ని రూల్స్ పాటించాల్సిందేనని ఫేస్ బుక్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
  • వినియోగదారులు ఫ్రెండ్స్ ను తమకు ఇష్టం వచ్చిన ప్రొఫైల్స్ కు యాడ్ చేసుకోవచ్చని.. ఆ ప్రొఫైల్ లో పెట్టిన ఫొటోలు, వీడియోలు, ఇతర పోస్టులు మాత్రమే వారికి కనిపిస్తాయని చెబుతున్నారు.



More Telugu News