టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఫ్రెంచ్ ఆటగాడు

  • ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ అర్హత మ్యాచ్
  • 61 బంతుల్లో 109 పరుగులు చేసిన మెక్ కియోన్
  • 18 ఏళ్ల వయసులో టీ20 సెంచరీ
  • ఆఫ్ఘన్ ఆటగాడు జజాయ్ పేరిట ఉన్న రికార్డు తెరమరుగు
ఫ్రాన్స్ క్రికెట్ జట్టు యువ బ్యాట్స్ మన్ గుస్తావ్ మెక్ కియోన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం నిర్వహిస్తున్న యూరప్ సబ్ రీజినల్ అర్హత పోటీల్లో మెక్ కియోన్ మెరుపు సెంచరీ బాదాడు. వాంటాలో స్విట్జర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫ్రెంచ్ బ్యాటర్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 61 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. 

ఈ ఇన్నింగ్స్ తో గుస్తావ్ మెక్ కియోన్ పురుషుల టీ20 క్రికెట్లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మెక్ కియోన్ వయసు 18 ఏళ్ల 280 రోజులు. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉంది. జజాయ్ 2019లో 20 ఏళ్ల వయసులో సెంచరీ నమోదు చేశాడు. ఐర్లాండ్ పై 62 బంతుల్లో అజేయంగా 162 పరుగులు సాధించాడు. ఇప్పుడా రికార్డును ఫ్రెంచ్ ఆటగాడు మెక్ కియోన్ బద్దలు కొట్టాడు. అయితే, తమ ఆటగాడు ప్రపంచ రికార్డు సెంచరీ సాధించినా, ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ జట్టు ఓటమిపాలైంది.


More Telugu News