ముర్ము విజయోత్సవ సభకు ఫుల్లుగా మందుకొట్టి వచ్చిన గుజరాత్ బీజేపీ నేత... వీడియో ఇదిగో!

  • రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘనవిజయం
  • ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన ముర్ము
  • గిరిజన మహిళను రాష్ట్రపతి పీఠం ఎక్కించారంటూ మోదీపై ప్రశంసలు
  • సొంతరాష్ట్రంలో ముర్ము విజయోత్సవ సభ అభాసుపాలు
భారత రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘనవిజయం సాధించడం, దేశ ప్రథమ పౌరురాలిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో, బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి పీఠం ఎక్కించిన ఘనత ప్రధాని మోదీదేనంటూ కమలనాథులు కీర్తిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ లో గిరిజన ప్రాబల్యం బాగా ఉన్న ఓ చోటౌడేపూర్ లో బీజేపీ ముర్ము విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గుజరాత్ మంత్రి నిమిషా సుతార్ కూడా హాజరయ్యారు. 

అయితే, జిల్లా బీజేపీ అధ్యక్షుడు రష్మీకాంత్ వాసవ ఫుల్లుగా మద్యం సేవించి ఈ కార్యక్రమానికి రావడం తీవ్ర విమర్శలపాలైంది. కారు దిగింది మొదలు ఊగుతూ, తూలుతూ కనిపించారు. స్టేజిపైనా మద్యం మత్తులో కూరుకుపోయారు. పక్కనే మహిళా మంత్రి ఉన్నా ఆయన గమనించే పరిస్థితిలో లేరు. నోటి నుంచి చొంగ కారుతుండగా మధ్యలో ఓసారి మూతి తుడుచుకున్నారు తప్ప, కార్యక్రమం ముగిసేంత వరకు కళ్లు తెరిచింది లేదు. 

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గుజరాత్ బీజేపీ నాయకత్వం మండిపడింది. వెంటనే రాజీనామా చేయాలంటూ రష్మీకాంత్ ను ఆదేశించింది. పార్టీ నిర్ణయం నేపథ్యంలో అతడు వెంటనే పదవి నుంచి తప్పుకున్నాడు. మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడంతో బీజేపీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇదే అదనుగా విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రాష్ట్రంలో మద్య నిషేధం అమలవుతోందా? అంటూ గుజరాత్ పీసీసీ చీఫ్ జగదీశ్ ఠాకూర్ ప్రశ్నించారు. 


More Telugu News