విమాన భోజనంలో పాము తల... హడలిపోయిన సిబ్బంది

  • అంకారా నుంచి డస్సెల్ డార్ఫ్ వెళుతున్న విమానం
  • మార్గమధ్యంలో సిబ్బంది భోజనాలు
  • ఓ ఆకు కూరలో పాము తల దర్శనం
  • ఫ్లయిట్ అటెండెంట్ కు దిగ్భ్రాంతికర అనుభవం
టర్కీ విమానయాన సంస్థ సన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన ఓ విమానం ఈ నెల 21న అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ కు వెళుతుండగా, అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా, సిబ్బంది భోజనానికి ఉపక్రమించారు. అందులో ఒకరు భోజనం చేస్తుండగా, కూరలో పాము తల కనిపించడంతో హడలిపోయారు. ఆకు కూరలతో తయారుచేసిన కూరలో ఈ పాము తల దర్శనమిచ్చిందట. ఫ్లయిట్ అటెండెంట్ కు ఈ భయానక అనుభవం ఎదురైంది.

ఫుడ్ లో బల్లులు, బొద్దింకలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే, పాము తల దర్శనమివ్వడంతో ఆ అటెండెంట్ పరిస్థితి వర్ణనాతీతం. ఈ ఘటనను సన్ ఎక్స్ ప్రెస్ విమానయాన సంస్థ తీవ్రంగా పరిగణించింది. వెంటనే ఆహార సరఫరా కంపెనీతో కాంట్రాక్టును సస్పెండ్ చేసింది. 

గత మూడు దశాబ్దాలుగా తమ విమానాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఇకపైనా అదే లక్ష్యంతో ముందుకెళతామని సంస్థ తెలిపింది. ఇలాంటి పొరపాట్లను తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.


More Telugu News